Chandrababu Family Members Worried About His Health: చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబసభ్యుల్లో రోజురోజుకూ ఆందోళన పెరుగుతోంది. జైల్లో అనారోగ్యానికి గురైన చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై పూర్తిస్థాయి నివేదిక తమకు అందజేయాలని శనివారం లిఖిత పూర్వకంగా రాజమండ్రి జైలు అధికారులను లోకేశ్ కోరారు. ఇప్పటి వరకూ అధికారులు తాజా నివేదికను కుటుంబసభ్యులకు అందజేయకపోవడం పట్ల తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అధికారుల తీరుపై తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని.. ఆయన జైలు నుంచి విడుదల కావాలని టీడీపీ శ్రేణులు, నాయకులు నిరసనలు, పూజలు, ధర్నాల వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు చంద్రబాబుకు తమ మద్దతు ప్రకటిస్తూనే ఉన్నారు.
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై లోకేశ్ శనివారం జైళ్ల శాఖ డీఐజీతో మాట్లాడారు. ములాఖత్ ద్వారా చంద్రబాబును కలిసిన అనంతరం ఆయన జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ను కలిశారు. చంద్రబాబు ఆరోగ్యంపై లోకేశ్ ఆయనను ప్రశ్నించారు. ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ప్రభుత్వ వైద్యుల నివేదికలో ఉందని.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఎందుకు వెల్లడిస్తున్నారని ప్రశ్నించారు. వైద్యుల సూచనల మేరకు చంద్రబాబు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలు ఎందుకు కల్పించటం లేదని జైళ్ల శాఖ డీఐజీని నిలదీశారు.
జైలు అధికారుల సూచనల ప్రకారం ఐదుగురు వైద్యుల బృందం చంద్రబాబు ఆరోగ్యపరిస్థితిపై పరీక్షలు నిర్వహించారు. అందులో భాగంగా రాజమహేంద్రవరం జీజీహెచ్ చర్మ వైద్య నిపుణులు డా. సూర్యనారాయణ, డా. సునీత.. చంద్రబాబుకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల తర్వాత వారు నివేదిక అందించగా.. ఆ వివరాలు శనివారం బయటకు వచ్చాయి. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేదని.. స్పష్టమవుతోందని ఆ నివేదక ద్వారా వెల్లడైంది.
చంద్రబాబు చేతులు, గడ్డం, ఛాతీ, వీపు, నడుము ప్రాంతాల్లో పొక్కులు, ఎర్రటి దద్దుర్లు ఏర్పడినట్లు నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ నివేదికను వైద్యులు జైలు ఉన్నతాధికారులకు సమర్పించారు. శరీరం అంతటా తెల్లటి పొక్కులు, కొన్ని ప్రాంతాల్లో వేడి కురుపుల వల్ల చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని వైద్యులు వివరించారు.
చంద్రబాబు సమస్య మరింత తీవ్రం కాకుండా ఉండాలంటే వైద్యులు కొన్ని మందులతో పాటు.. చంద్రబాబును చల్లని వాతావరణంలో ఉంచాలని సూచించారు. చల్లని వాతావరణం కల్పించకపోతే సమస్య తీవ్రమవుతుందని జైలు అధికారులకు వైద్యులు సూచించారు. అంతేకాకుండా రక్తపరీక్షలు, బీపీ, మధుమేహం ఇతర పరీక్ష ఫలితాలన్నీ సాధారణంగానే ఉన్నాయన్నారు.