చిన్నాన్నను చంపిన వారిని వంద రోజులైనా బయటపెట్టలేని ప్రభుత్వం... రాష్ట్రాన్ని ఏం కాపాడుతుందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వివేకానంద హత్య కేసులో అనుమానితుడి ఆత్మహత్య వెనుక అనేక సందేహాలు ఉన్నాయని పేర్కొన్నారు. గుంటూరులో వైకాపా బాధితుల పునరావాస కేంద్రంలో బాధితుల్ని పరామర్శించిన చంద్రబాబు... ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రమాణ స్వీకారం రోజున జగన్ చెప్పిందొకటి.. ప్రస్తుతం చేసేది మరొకటని విమర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఇప్పటికి 8 హత్యలు జరిగాయని వివరించారు. వందల కుటుంబాలు ఊరు వదిలి వెళ్లిపోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా కార్యకర్తలపై దాడులను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చి రావణ పాలన సాగిస్తారా అని నిలదీశారు. మంత్రివర్గంలో చర్చించే ముఖ్యమైన అంశంగా శాంతి భద్రతల అంశం ఎందుకు కనిపించలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. 100 రోజుల పాలనలో 499 ఘోరాలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైకాపా ప్రభుత్వ బాధితుల పరిరక్షణకు కమిటీ
వైకాపా దాడుల నుంచి తెదేపా కార్యకర్తలను కాపాడేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నక్కా ఆనంద్ బాబు, అశోక్ బాబు, గద్దె రామ్మోహన్, మద్దాలగిరి మరో ఇద్దరిని కమిటీ సభ్యులుగా పేర్కొన్నారు. తెదేపా కార్యకర్తలకు వీరు అన్ని విధాలా సహకరిస్తారని వెల్లడించారు. వైకాపా అరాచకాలపై న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు. అలాగే వైకాపా ప్రభుత్వ బాధితుల పునరావాస నిధిని చంద్రబాబు ఏర్పాటు చేశారు. తెదేపా నేతలు వెంటనే దీనికి భారీగా విరాళాలు ప్రకటించారు. గల్లా జయదేవ్, జి.వి.ఆంజనేయులు రూ.5 లక్షల చొప్పున ... ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, మద్దాల గిరి రూ.లక్ష చొప్పున విరాళాలు ప్రకటించారు.