రాష్ట్రంలో కరోనాను ఎలా కట్టడి చేస్తారో చెప్పాలని వైకాపా ప్రభుత్వాన్ని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేశారు. దక్షిణాదిలో ఏ రాష్ట్రం కూడా మద్యం దుకాణాలు తెరవలేదన్న చంద్రబాబు... ఏపీ ప్రభుత్వానికి ఎందుకంత తొందరని నిలదీశారు. కమీషన్ల కోసం ప్రజల జీవితాలతో ఆడుకుంటారా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో విక్రయించే మద్యం బ్రాండ్లన్నీ నాసిరకమని చంద్రబాబు అన్నారు. ఈ బ్రాండ్లతో ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు వస్తాయని స్పష్టం చేశారు. మద్యం ధరలు పెరిగితే... తాగే వారి సంఖ్య తగ్గుతుందని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.
రాష్ట్రంలో నిన్న విచ్చలవిడిగా వేల మద్యం దుకాణాలు తెరిచారని చంద్రబాబు ధ్వజమెత్తారు. మద్యం దుకాణాలను పోలీసులతో నియంత్రిస్తారా? అని ప్రశ్నించారు. అలాగే చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద పెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్ణయం వల్ల సోమవారం ఆరుగురు చనిపోయారని చంద్రబాబు తెలిపారు. నెల్లూరు జిల్లాలోనే ముగ్గురు చనిపోయారన్న ఆయన... మద్యం వల్ల కొన్నిచోట్ల హత్యలు, ఆత్మహత్యలు జరిగాయని స్పష్టం చేశారు. మద్యం దుకాణాలు వద్దని కొన్నిచోట్ల మహిళలు ఆందోళన చేసిన విషయాలను గుర్తు చేశారు.
40 రోజులుగా రాష్ట్రంలో మద్యం అమ్మలేదని గుర్తు చేసిన చంద్రబాబు... మద్యపాన నిషేధానికి ఇంతకంటే మంచి సమయం లేదని ప్రభుత్వానికి సూచించారు.
కరోనా నియంత్రణలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం రాష్ట్రంలో లేని తనను విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. క్రమశిక్షణ కలిగిన పౌరుడిగా లాక్డౌన్ వేళ ఇంట్లో ఉన్నానని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి రమ్మంటారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రావడానికి తాను సిద్ధమని... ఏం చేయమంటారో చెప్పాలని సవాల్ విసిరారు.
ఇదీ చదవండి