సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చి... అధికారంలోకి వచ్చాక విస్మరించిందని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు విమర్శించారు. ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య ఆధ్వర్యంలో గుంటూరులో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ వరకూ జరిగిన ప్రదర్శనలో వేలాది మంది ఉపాధ్యాయులు పాల్గొని... సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చి 9 నెలల గడిచినా... ఇప్పటి వరకు సీపీఎస్ రద్దు గురించి కనీస కార్యాచరణ లేకపోవడం దారుణమన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉపాధ్యాయ సంఘాలు యూటీఎఫ్ ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దు చేయాలంటూ ధర్నాకు దిగాయి. పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి మెయిన్ రోడ్డు మీదుగా అంబేడ్కర్ విగ్రహ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు.
కర్నూలు జిల్లాలో
11వ పీఆర్సీని అమలు చేయాలని ఉపాధ్యాయ ఐక్య ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలులో ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. రాజ్ విహార్ కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. సీపీఎస్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని లేదంటే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
ప్రకాశం జిల్లాలో
ప్రకాశం జిల్లా ఒంగోలులో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వైకాపా అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలను ఒక్కటి కూడా పరిష్కరించలేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఉద్యోగులు పేర్కొన్నారు. హామీలు వెంటనే నెరవేర్చాలని కోరారు.
విజయనగరం జిల్లాలో
సీపీఎస్, పీఆర్సీ, డీఏ బకాయిలపై విజయనగరం జిల్లాలో ఉపాధ్యాయులు ర్వాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి మయూరి కూడలి, రహదారులు-భవనాల శాఖ అతిథి గృహం, జిల్లా పోలీసు కార్యాలయం మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ సాగింది. ప్రభుత్వం ఇప్పటికైనా ఉపాధ్యాయ సమస్యలపై స్పందించకపోతే శాసనసభ సమావేశాల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని ఉపాధ్యాయులు హెచ్చరించారు.
కడప జిల్లాలో
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కడపలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ర్యాలీ చేపట్టారు. పాత పింఛన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: