Funds Diversion in AP: ఏపీలో రూ.1039 కోట్ల రూపాయల ఇళ్ల నిర్మాణ నిధుల దారి మళ్లింపుపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి జీవో ఇవ్వకుండా.. నిధులు దారిమళ్లించటం ఏంటని కేంద్రగృహనిర్మాణశాఖ ప్రశ్నించింది. తక్షణమే సింగిల్ నోడల్ ఖాతాకు.. ఆ నిధులు రీఎంబర్సు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు.. లే అవుట్లలో నీటి సరఫరా పనుల బిల్లుల చెల్లింపు జరగకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 34 వేల ఇళ్ల నిర్మాణం.. ఆలస్యం కానుంది.
Central Government Funds Diversion: కేంద్ర ప్రభుత్వ నిధుల మళ్లింపు వివాదాస్పదం అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడంలేదు. తాజాగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద.. కేంద్రం మంజూరు చేసిన రూ.1039 కోట్ల రూపాయల నిధుల మళ్లింపు.. వ్యవహారంపై కేంద్ర గృహ నిర్మాణ శాఖ ఆగ్రహం వ్యక్తంచేసింది. కనీసం జీవో లేకుండా నిధులు మళ్లించడాన్ని తప్పుపట్టింది. తక్షణమే సింగిల్ నోడల్ ఖాతాకు.. ఆ నిధుల్ని రీయంబర్స్ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని.. కేంద్ర గృహనిర్మాణ శాఖ ఆదేశించింది.
ఈ ఏడాదిలో ప్రధానమంత్రి ఆవాస్ యోగజన పథకం కింద.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఇళ్ల నిర్మాణం కింద 3 వేల 84 కోట్ల రూపాయలను కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంజూరు చేసింది. అందులో 18 వందల 79 కోట్ల రూపాయల్ని కేంద్రం విడుదల చేసింది. ఈ మొత్తం నుంచి 639 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడేసింది. రాష్ట్రవాటాగా ఇవ్వాల్సిన 385 కోట్లతో పాటు 113 కోట్ల రూపాయల మేర బిల్లులను.. రాష్ట్ర గృహనిర్మాణశాఖ బకాయిపెట్టింది.
ప్రస్తుతం ఉమ్మడిగా నిర్వహించే సింగిల్ నోడల్ ఖాతాలో కేవలం కోటిన్నర రూపాయలు మాత్రమే మిగిలాయి. మరోవైపు పీఎం ఆవాస్ యోజన గ్రామీణ పథకంలో రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన 221 కోట్లు ఇవ్వకపోవటంతో.. కేంద్రం రూ.1174 కోట్ల నిధుల్ని నిలిపివేసింది. దీనితోపాటు 42 కోట్ల 71 లక్షల రూపాయల మేర పెండింగ్ బిల్లుల కారణంగా 211 లేఅవుట్లలో నీటి సరఫరా పనులు నిలిచిపోయాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 2.34 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
జగనన్నకు చెబుదాం కార్యక్రమంలోనూ.. 1902 కాల్ సెంటర్‌కు గృహ నిర్మాణశాఖలో పెండింగ్ బిల్లులపైనే అధిక ఫోన్ కాల్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. గృహనిర్మాణ సమస్యలపై వచ్చిన 5 వేల 872 కాల్స్‌లో 4 వేల 772 ఫోన్ కాల్స్ పెండింగ్ బిల్లులవేనని.. సమాచారం. పరిస్థితి ఇలా ఉంటే.. 2 వేల 660 జగనన్న లేఅవుట్లలో స్వాగత ద్వారాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 166 కోట్లు వెచ్చించడం.. విమర్శలకు తావిస్తోంది.