చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం... ఏపీలో ప్రముఖ వాణిజ్య పంట మిర్చి ధరలపైనా పడింది. మిర్చి క్రయవిక్రయాలకు ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ గా గుంటూరుకు పేరుంది. ఇక్కడకు వచ్చే మిర్చి సరకు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకూ ఎగుమతి అవుతుంది. ముఖ్యంగా గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో పండించే.. తేజా రకం మిర్చికి చైనా దేశంలో మంచి గిరాకీ ఉంది. డిమాండ్ మేరకు అక్కడికి వ్యాపారులు మిర్చిని ఎగుమతి చేస్తుంటారు.
ఈ ఏడాది కూడా సంక్రాంతి నుంచి కొత్త పంట చేతికొచ్చింది. ఆ సరుకుని విక్రయించేందుకు రైతులు మార్కెట్ కు తీసుకు వస్తున్నారు. విదేశీ మార్కెట్ల నుంచి డిమాండ్ కారణంగా సీజన్ మొదట్లో 20వేలకు పైగానే పలికింది. అయితే.. వారం రోజులుగా పరిస్థితి మారిపోయింది. మేలు రకం తేజా మిర్చి.. క్వింటా 13వేల 500కు పడిపోయింది. మిగతా రకాలు 12వేల రూపాయలు పలుకుతున్నాయి. ధరలు పడిపోవటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వైరస్ కారణంగా దిగుబడులు కూడా భారీగా తగ్గాయి. తాలు కాయలు ఎక్కువగా వచ్చాయి. ఇపుడు ధరలు కూడా పడిపోవటం వారిలో ఆందోళన కలిగిస్తోంది.
ధరల పతనానికి కరోనా వైరస్ ఓ కారణంగా కనిపిస్తోంది! చైనాకు మిర్చి ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. ప్రస్తుతం నాణ్యమైన మిర్చి కూడా క్వింటాల్ 13వేల 500 రూపాయలు మాత్రమే పలుకుతోంది. ఈ మధ్యలోనే క్వింటాకు 6 వేల రూపాయలకు పైగా ధర పతనమైంది. ఎగుమతుల్లో ఏర్పడిన ప్రతిష్టంభన కారణంగా ధరలు ఇంతలా పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కరోనా దెబ్బకు చైనాలోని వ్యాపార వర్గాలు లావాదేవీలకు విరామమిచ్చారు. విదేశాలకు పంపేందుకు కంటైనర్లలో లోడ్ చేసిన సరకును శీతల గిడ్డంగులకు తరలించారు. చైనా నుంచి ఆర్డర్లు వచ్చినప్పుడు లేదా మంచి ధర పలికినప్పుడు వాటిని విక్రయించుకోవచ్చని భావిస్తున్నారు. సరకు ఎక్కువ రావడం వల్ల ధరలు పడిపోయాయని.. గతేడాది కంటే..మంచి ధరలే ఉన్నాయని అధికారులు అంటున్నారు.
ఏపీ నుంచి చైనాకు ఏటా 3వేల500కోట్ల రూపాయల విలువయ్యే మిర్చి ఎగుమతులు జరుగుతాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే గుంటూరు మిర్చిపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి.
ఇదీ చదవండి: కరోనా : వ్యాక్సిన్ తయారీ ఇప్పట్లో కష్టమే!