మూడు రాజధానులపై వైకాపా సర్కారు వైఖరిని నిరసిస్తూ... అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు వరుసగా 38వ రోజూ కొనసాగాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. రాజధాని మహిళలు పోలేరమ్మ గుడివద్ద పొంగళ్లు పెట్టారు. తుళ్లూరులో రైతులు, మహిళలు చేస్తున్న మహాధర్నాలో తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేసే అధికారం ఎవరికి లేదని చెప్పారు. తుళ్లూరు ధర్నాకు హాజరైన పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి... బాధితులకు అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. అనంతపురం, కడప జిల్లాల నుంచి విద్యార్ధి ఐకాస నేతలు వచ్చి సంఘీభావం తెలిపారు. మహిళలు చేస్తున్న దీక్షకు విశాఖ నుంచి వచ్చిన ప్రజలు మద్దతు తెలిపారు. ప్రజా నాట్యమండలి నుంచి కళాకారులు వచ్చి రైతులు పడుతున్న బాధను పాట రూపంలో వివరించారు. రైతులను ఉత్తేజపరిచారు.
రైతుల హెచ్చరిక
రోజుల తరబడి ఆందోళనలు చేస్తున్నా.... స్థానిక ప్రజా ప్రతినిధులకు చీమ కుట్టినట్లయినా లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే వైఖరి కొనసాగితే త్వరలోనే నేతల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకూ పోరాటం సాగిస్తామని రైతులు తెలిపారు.
ఇవాళ మహిళల ర్యాలీ
ఈ రోజు మందడం నుంచి అనంతవరం వెంకటేశ్వరస్వామి దేవస్థానానికి మహిళలు మొక్కులు తీర్చుకునేందుకు ర్యాలీగా వెళ్లనున్నారు. రాజధానిలోని తుళ్లూరు, వెలగపూడి, మందడం ప్రాంతాల్లోని మహిళలు పూజలు చేయనున్నారు.
ఇదీ చదవండి:అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు దిశగా సర్కార్ కసరత్తు