ప్రేమ వ్యవహారంలో ఓ యువతి చివరకు ఓ ప్రేమోన్మాది చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైంది. గుంటూరులో రెండేళ్ల క్రితం జరిగిన ఈ విషాద ఘటన ఇపుడు ఆలస్యంగా వెలుగు చూసింది. రెండేళ్లు గడిచినా తమ కుమార్తె ఆచూకీ తెలియటం లేదని ఇటీవల బాధితురాలి తల్లిదండ్రులు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని కలిసి స్పందనలో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పాత గుంటూరుకు చెందిన 25 ఏళ్ల యువతి నగర శివారులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సాంకేతిక విద్య అభ్యసించింది. అదే కళాశాలలో చదివే కరీంతో తొలుత ప్రేమలో పడింది. తర్వాత రఫీ అనే యువకునికి దగ్గరైందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రఫిని పెళ్లి చేసుకోవాలనుకుని ఆ యువతి ఇంటి నుంచి బయటకు వచ్చిన విషయం మొదటి ప్రేమికుడు కరీం తెలుసుకుని పెళ్లికి అడ్డు పడ్డారని పోలీసువర్గాల సమాచారం. రఫీతో పెళ్లికి సిద్ధమైన విషయం వారి కుటుంబ పెద్దలకు కరీం చేరవేశారని అంటున్నారు.
యువతి తల్లిదండ్రులు స్పందించి పోలీసులను ఆశ్రయించటం, వెంటనే రఫీ ఆ యువతిని తీసుకొచ్చి పోలీసుల సమక్షంలో కుటుంబీకులకు అప్పగించగా తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లటంతో అప్పట్లో వ్యవహారం సద్దుమణిగింది. తిరిగి కొన్నాళ్ల తర్వాత ఆ యువతి ఉద్యోగం చేయటానికి బయటకు రాకపోకలు సాగిస్తూ మొదటి ప్రేమికుడు కరీంకు దగ్గరై పెళ్లి చేసుకోవాలని కోరింది. సరేనన్న అతను గుంటూరు ఆలీనగర్ ప్రాంతంలో ఓ గది అద్దెకు తీసుకుని ఆమెతో ఉన్నాడు. అయితే తనతో పాటు మరో యువకునితోనూ ప్రేమాయణం సాగించిన ఆమెను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక గదిలోనే బంధించి గోడ కేసి తల పగలగొట్టి, గొంతు నులిమి, చాకుతో పీక కోసి క్రూరంగా చంపినట్లు తాజా పోలీసుల విచారణలో బయటపడింది. ఇవేం బయటకు పొక్కకుండా, పోలీసుల దృష్టికి వెళ్లకుండా అతను అత్యంత గోప్యంగా వ్యవహరించాడు.
తేలిగ్గా తీసుకున్న పోలీసులు..
2018 మార్చిలో తమ కుమార్తె కనిపించటం లేదని తల్లిదండ్రులు మరోసారి పాత గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే ఆ యువతి ఒకసారి ఇంటి నుంచి వెళ్లిపోవటం వంటివి వారి దృష్టిలో ఉన్నాయి. దీంతో పోలీసులు కేసును తేలిగ్గా తీసుకున్నారు. రెండేళ్లు గడిచినా తమ కుమార్తె ఆచూకీ లేదని ఇటీవల ఎస్పీ అమ్మిరెడ్డిని కలిసి యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయటంతో పోలీసులు రఫీని పిలిచి విచారించగా ఎలాంటి సమాచారం రాలేదు. కరీంను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే ఆ యువతితో తనకు పరిచయం లేదని చెబుతూ వచ్చాడు. ఆమె అదృశ్యమైనప్పుడు సీడీఆర్ జాబితా బయటకు తీసి పోలీసులు విశ్లేషించారు. యువతికి ఎవరు ఎక్కువగా ఫోన్లు చేశారో తెలుసుకున్నారు.
మూడు నెలలు కరీం ఆ యువతితో ప్రత్యేకంగా ఓ సిమ్ తీసుకుని సంభాషణలు చేసినట్లు నిర్ధారించుకుని తమదైన శైలిలో విచారించగా చేసిన నేరం అంగీకరించాడని తెలిసింది. 2018 మే 25 నుంచి ఆ యువతి ఫోన్, కరీం వినియోగించిన ప్రత్యేక సిమ్ మూగబోయాయని గుర్తించారు. యువతిని గదిలో చంపి కాళ్లు, చేతులు సగం కత్తిరించి గోతాములో మృతదేహాన్ని మూటగట్టి పొన్నూరు రోడ్డులో నిరుపయోగ భూమిలో పడేసి పెట్రోలు పోసి తగుల బెట్టినట్లు నిర్ధారణ అయింది. ఆలీనగర్‌లోని గది, శవాన్ని తగులబెట్టిన ప్రదేశాలను పోలీసులు పరిశీలించారు. రెండేళ్ల కిందట కేసు నమోదైనా అప్పట్లో పోలీసులు పకడ్బందీగా విచారణ చేపట్టలేదనే అభిప్రాయం వ్యక్తమైంది.
ఇదీ చదవండి: