Bandi Sanjay Reaction on Khammam BRS Meeting : తెలంగాణలోని ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో ధ్వజమెత్తారు. నిన్న ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ తప్ప.. బీఆర్ఎస్ సభను ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. సభకు వచ్చిన జనాలు, నేతలు మనస్ఫూర్తిగా పాల్గొనలేదన్న ఆయన.. ప్రజలను బెదిరించి సభను విజయవంతం చేయాలని చూశారని ఆరోపించారు. ఈ మేరకు దిల్లీలో బండి సంజయ్ మాట్లాడారు.
Bandi Sanjay comments on Khammam BRS Meeting : సీఎం కేసీఆర్ వద్ద ఉన్న లిక్కర్ డబ్బులు పంచుకోవడానికి జాతీయ నేతలు వచ్చినట్లు ఉన్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. కేసీఆర్ నోట ఏ దేశం మాట వచ్చినా ఆ దేశం సర్వనాశనం అవుతుందని.. భారతదేశం బాగుందనే మాట కేసీఆర్ నోట రావొద్దని కోరుకుంటున్నానని చెప్పారు. రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదన్న బండి సంజయ్.. పొలం వద్ద ఫ్రీ కరెంట్ అని, ఇంటి దగ్గర కరెంట్‌కు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. డిస్కంలకు డబ్బులు కట్టకుండా ఫ్రీ కరెంట్ అంటున్నారని.. ముందుగా వాళ్లకు కట్టాల్సిన బకాయిలు చెల్లించాలని సూచించారు.
కేసీఆర్ స్పీచ్ పాతదే.. కొత్తగా ఏం మాట్లాడలేదు..: ఖమ్మం సభలో కేసీఆర్ ఇచ్చిన స్పీచ్ గతంలో మాట్లాడిందేనని.. కొత్తగా ఏం మాట్లాడలేదని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ భాష, వేషం తుపాకి రాముడిలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఒక జోకర్ అని, జోకర్ మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించిన సమాజ్ వాదీ పార్టీతో కేసీఆర్ జతకట్టారని మండిపడ్డారు. దళితులను వంచించిన కేసీఆర్‌కు వాళ్ల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. దళితులను పారిశ్రామిక వేత్తలుగా మార్చిన ఘనత బీజేపీది అన్న ఆయన.. దళితులకు కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఖమ్మం సభలో కేసీఆర్ కనీసం జై తెలంగాణ అని కూడా అనలేదని.. తెలంగాణను మరచిపోయిన కేసీఆర్‌తో జై తెలంగాణ అనిపిస్తామని హెచ్చరించారు.
అగ్నిపథ్ కాదు.. రాష్ట్ర పోలీస్ వ్యవస్థపై ఆలోచించు..: యాదాద్రిపై ఖర్చు చేస్తే భారీగా హుండీ ఆదాయం వస్తోందని గతంలో కేటీఆర్ అన్నారని గుర్తు చేసిన బండి సంజయ్.. ఆలయాలపై ఖర్చు చేయండి.. నిధులు వస్తాయని ఇతర రాష్ట్రాల సీఎంలకు కేసీఆర్ చెప్పారా అని ప్రశ్నించారు. గోదావరిలో లభ్యత ఉన్న పూర్తి నీటిని వాడుకునే తెలివి కేసీఆర్‌కు లేదన్న ఆయన.. కృష్ణా జలాల్లో మన వాటాను కూడా వదులుకున్న వ్యక్తి కేసీఆర్ అని ఆక్షేపించారు.
రాష్ట్రంలో బోర్ల సంఖ్య 18 లక్షల నుంచి 24 లక్షలకు ఎందుకు పెరిగిందని ప్రశ్నించిన సంజయ్.. 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. అగ్నిపథ్ గురించి మాట్లాడే కేసీఆర్.. రాష్ట్ర పోలీసు వ్యవస్థపై ఆలోచించాలని బండి సంజయ్ సూచించారు. తెలంగాణలో పోలీసుల పరిస్థితిపై కేసీఆర్ ఎందుకు మాట్లడటం లేదని ప్రశ్నించారు. పోలీస్ నియామకాల్లో కఠిన నిబంధనల వల్ల యువత రోడ్డెక్కారని గుర్తు చేసిన బండి సంజయ్.. కేసీఆర్ మాటలను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి..