కృష్ణా, గోదావరి బోర్డుల ఏర్పాటుతో ఆయా నదులపై ఉన్న ప్రాజెక్టులు కేంద్రం పరిధిలోకి వెళతాయనే ప్రచారం సరికాదని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. నదీ బోర్డుల విషయంలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏ రాష్ట్ర పరిధిలోని ప్రాజెక్టులను ఆయా రాష్ట్రాలే నిర్వహించుకుంటాయని జీవీఎల్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారమే కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటు చేస్తూ..కేంద్రం గెజిట్ జారీ చేసిందని వివరించారు.
జల వివాదాలు పెద్దవి కాకుండా కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకుందని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. అయితే దీన్ని కూడా రాజకీయం చేయటం తగదని ఆయన అన్నారు. వివాదాలు పెంచి రాజకీయ లబ్ధి కోసం తెరాసతో పాటు వైకాపా, తెదేపా యత్నించాయని ఆరోపించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, ఇతర సమస్యలపై చర్చించేందుకు ఈనెల 19న విజయవాడలో భాజాపా ముఖ్యనేతల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
'పేరు మీది..నిధులు మేం ఇవ్వాలా ?'
ముఖ్యమంత్రి జగన్ తన పేరుతో నిర్మించుకునే కాలనీలకు కేంద్రం నిధులు ఇవ్వాలనడం విడ్డూరంగా ఉందని జీవీఎల్ అన్నారు. గుంటూరు రైల్వే స్టేషన్ ఆధునీకీకరణ పనులను పరిశిలించిన ఆయన..పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో కేంద్ర నిధులతో నిర్మించిన టిడ్కో గృహాలను ఇంకా లబ్ధిదారులకు ఇవ్వకపోవటాన్ని జీవీఎల్ తప్పుబట్టారు. ఇది పేదలకు అన్యాయం, ద్రోహం చేసినట్లేనని అభిప్రాయపడ్డారు.
ఈ విషయంపై కేంద్ర మంత్రితో మాట్లాడి అక్కడ మౌలిక వసతులు కల్పించి.. త్వరగా లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జగనన్న కాలనీల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికి పాల్పడుతోందని జీవీఎల్ విమర్శించారు. గతంలో చంద్రబాబు అనుసరించిన ప్రచార ఫార్మూలానే జగన్ అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి
AP NOMINATED POSTS 2021: నామినేటెడ్ పదవులు దక్కింది వీరికే..