BJP leader Kanna Lakshminarayana: గుంటూరు జిల్లా రాజకీయాల్లో గత 4దశాబ్దాలుగా కన్నా లక్ష్మినారాయణ కీలకంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగిన కన్నా... ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దాదాపు 15 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. పెదకూరపాడు నుంచి 4సార్లు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఓసారి గెలిచిన కన్నాకు..జిల్లాలో విస్తృతమైన పరిచయాలు, అనుచరగణం ఉంది. 2019లో అత్యంత క్లిష్టమైన సమయంలో భాజపారాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. ఆయన అధ్యక్షునిగా ఉన్న సమయంలోనే జనసేన-భాజపాతో పొత్తు పెట్టుకుంది. సమన్వయ కమిటి ఏర్పాటు చేసుకుని రెండు పార్టీలు కలిసి నడిచాయి. పవన్ వంటి జనాకర్షక నేత, కేంద్రంలో మోదీ ప్రభుత్వం కలిపి రాష్ట్రంలో రెండుపార్టీలు బలమైన శక్తిగా ఉండాలని కన్నా భావించారు. అయితే...రాష్ట్ర అధ్యక్ష పదవీకాసం ముగిసిన తర్వాత అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడటం కన్నాను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది.
ఓవైపు జనసేనతో సంబంధాలు బలహీనం కావటం, రాష్ట్రంలో భాజపా బలోపేతం కాకపోవటంతో కన్నా ఏంచేయాలనే మల్లగుల్లాలు పడ్డారు. అదే సమయంలో భాజపాతో సంబంధాలు సరిగా లేవని జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలను కన్నా అందిపుచ్చుకున్నారు. సోము వీర్రాజు వల్లే ఈ పరిస్థితి వచ్చిందని బహిరంగంగా కన్నా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల తర్వాత ఆయన అనుచరులు వచ్చి కన్నాను కలిసి మాట్లాడి వెళ్లారు.
అయితే భాజపా పెద్దలు కన్నాకు ఫోన్ చేసి ఇకపై బహిరంగ వ్యాఖ్యలు, మీడియాతో మాట్లాడటం వద్దని ఆదేశించారు. సమస్యను గుర్తించామని కన్నాతో పార్టీ పెద్దలు చెప్పినట్లు సమాచారం. కన్నా అనుచరులు మాత్రం ఆయనకు పార్టీ మారే ఆలోచన లేదని చెబుతున్నారు. పవన్ చెప్పిన విషయాల్ని కన్నా సమర్థించారే తప్ప పార్టీకి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదని స్పష్టం చేస్తున్నారు.
కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలతో జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు ఉంటుందనే సంకేతాలు వస్తున్నాయి. అందులో భాజపా ఉంటుందా లేదా అనేది మాత్రం స్పష్టత లేదు. ఈ విషయంలో భాజపా తీసుకునే నిర్ణయం పైనే కన్నా భవిష్యత్ కార్యాచరణ ఆధారపడి ఉంటుందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
ఇవీ చదవండి: