గోవధ నిషేధంపై వైకాపా ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా భాజపా ఆందోళనకు దిగింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపు మేరకు విజయనగరం, ప్రకాశం, గుంటూరు, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాల్లో భాజపా నేతలు కలెక్టరేట్ల వద్ద నిరసన తెలిపారు. గోరక్షణ చట్టానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
విజయనగరంలో...
భాజపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని ఆధ్వర్యంలో పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. గోరక్షణ చట్టానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని బర్తరఫ్ చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నందునే... నేతలు అలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల దేవాలయాలపై దాడులు జరిగినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటం దురదృష్టకరమని ఆవేదన చెందారు. గోరక్షణ చట్టాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పదవి నుంచి బర్తరప్ చేయాలని డిమాండ్ చేశారు.
గుంటూరులో...
గోరక్షణ చట్టంపై వ్యాఖ్యలు చేసిన వైకాపా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని గుంటూరు భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. వైకాపా నాయకులు చేసిన వ్యాఖ్యలు సరికాదని తక్షణమే దేశ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని రాష్ట్ర కార్యదర్శి పాతురి నాగభూషణం, జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. గోవుకు మేత వేసి, పూజలు చేశారు. రాక్షసుని వేషంలో ఉన్న వైకాపా నాయకులు గోవును హరించేందుకు యత్నించగా వారిని నిలువరించేందుకు తాము అడ్డుకున్నట్టుగా.. భాజపా కార్యకర్తలు ప్రదర్శన చేశారు.
చిత్తూరులో...
హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా మదనపల్లెలో భాజపా నాయకులు ధర్నా చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట భాజపా నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గోవులను సంరక్షించాలని... గో సంరక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతం ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి:
BJP Protest: ఆంగ్లేయులది, జగన్‌ది ఒకటే మనస్తత్వం: సోము వీర్రాజు