YSR Aarogyasri: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ట్రస్టులో ఆర్థిక సంక్షోభం కొనసాగుతూనే ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసినా.. అనుబంధ ఆసుపత్రులకు మాత్రం గత సంవత్సరానికి సంబంధించిన చెల్లింపుల్లో పురోగతి కనిపించడం లేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం రూ.900 కోట్లకు పైగా బిల్లుల బకాయిలు పెండింగులో ఉన్నాయి.
అనధికార వసూళ్లు: గతేడాది అక్టోబర్ చెల్లింపులు ఇటీవల వరకు జరుగుతూ వచ్చాయి. గతేడాది నవంబరు నుంచి మాత్రం బిల్లుల చెల్లింపులు నిలిచాయి. దీంతో అనుబంధ ఆసుపత్రుల యాజమాన్యాలు పేదలకు చికిత్స అందించేందుకు ముందుకురాని పరిస్థితులు క్రమంగా తీవ్రం కాబోతున్నాయి. ముఖ్యంగా అత్యవసర కేసులు, ప్రసవాలు, గుండె సంబంధ సమస్యలతో వెళ్లే వారి నుంచి ఆసుపత్రుల యాజమాన్యాలు అనధికారిక వసూళ్లను ఎక్కువ చేస్తున్నట్లు సమాచారం.
ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద చేరే వారికి రీఎంబర్స్‌మెంట్ కింద దరఖాస్తు చేసుకోవాలని, నగదు చెల్లిస్తేనే చికిత్స అందిస్తామని పలు ఆసుపత్రుల వారు చెబుతున్నట్లు ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఆసుపత్రి అనుబంధ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ రూ.350 కోట్ల బిల్లులను ట్రస్టు వారు సీఎఫ్‌ఎంఎస్ ద్వారా అప్‌లోడ్ చేసినప్పటికీ.. వాటికి కూడా చెల్లింపులు జరగలేదని విచారం వ్యక్తం చేశారు.
ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి విజ్ఞప్తులు: ఆరోగ్య శ్రీ ట్రస్టు పరిధిలో సుమారు రెండు వేల నెట్‌వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. ఇందులో 900 వరకు ప్రైవేట్ ఆసుపత్రులున్నాయి. ఇందులో 600 ఆసుపత్రుల నుంచి కేసులు ఎక్కువగా వస్తుంటాయి. వీటిలో కొన్ని ఆసుపత్రులు పూర్తిగా ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి వచ్చే బిల్లుల పైనే ఆధారపడి నడుస్తున్నాయి. త్వరలోనే చెల్లింపుల చర్యలు మొదలవుతాయని, చికిత్సలకు అవరోధం లేకుండా చూడాలని ఆసుపత్రుల యాజమాన్యాలకు ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి విజ్ఞప్తులు వెళ్తున్నాయి.
రోగులపై తీవ్ర ప్రభావం: ఆసుపత్రులకు చెల్లింపులు సకాలంలో జరగకపోతుండడంతో దాని ప్రభావం రోగులకు ఉచితంగా అందించాల్సిన చికిత్సపై కనిపిస్తోంది. వ్యాధి నిర్థారణ పరీక్షల పేరుతోనే వేలాది రూపాయలను రోగుల నుంచి వసూళ్లు చేసి.. అనారోగ్య తీవ్రత అనుసరించి కొద్ది రోజులకు ఇన్ పేషంట్ల కింద చేర్చుకుంటున్నాయి. వ్యాధి నిర్థారణ పరీక్షలు చేసిన వెంటనే ఇన్‌పేషంట్లుగా చేర్చుకుంటే.. వసూళ్లు ఆగిపోతాయన్న ఉద్దేశంతో పలు ఆసుపత్రుల వారు ఉద్దేశపూర్వకంగా ఈ పంథా అనుసరిస్తున్నారు. అంతేకాకుండా.. రోగుల వద్ద వ్యాధి నిర్థారణ పరీక్షల రిపోర్టులు ఉన్నా.. మళ్లీ అవసరమని చెప్పి పరీక్షలు చేయిస్తున్నాయి. చాపకింద నీరులా జరిగిపోతున్న ఇలాంటి ఘటనల్లో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి.
పరీక్షలంటూ దోపిడీ: ఇటీవల విజయవాడ నగరానికి చెందిన ఓ మహిళ గర్భసంచి సమస్యతో నెట్‌వర్క్ ఆసుపత్రికి వెళ్లగా.. వ్యాధి నిర్థారణ పరీక్షలకు సుమారు రూ.15 వేల వరకు వసూలు చేశారు. రెండు వారాల తరువాత వస్తే.. తదుపరి చికిత్స అందిస్తామని చెప్పారు. ఉచిత చికిత్స కోసం వెళ్లిన ఆ మహిళ చేసేదేమీలేక.. ఇంటికి తిరిగొచ్చారు. మూడు వేల రకాల వరకు ఉచిత చికిత్స అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. ‘మీ జబ్బు ప్రభుత్వం అందచేసిన చికిత్సల జాబితాలో లేదు. ఉచితంగా చికిత్స అందించడం జరగదు’ అని పలు ఆసుపత్రుల యజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి.
అందని వేతనాలు: ఆరోగ్యశ్రీ ట్రస్టు తరపున సుమారు 2,200 మంది ఆరోగ్య మిత్రలు పొరుగు సేవల కింద పనిచేస్తున్నారు. వీరికి ఇప్పటివరకు మార్చి వేతనాలు అందలేదు. ట్రస్టు ఆధ్వర్యంలో వీరు పనిచేస్తున్నందున వీరికి వేతనాల చెల్లింపులు ప్రతినెలా తొలి వారంలోగానే జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో వేతనాల చెల్లింపులు ఆలస్యం కావడం ఇదే తొలిసారి అని ఆరోగ్యమిత్రలు చెబుతున్నారు.
ఇవీ చదవండి: