Bar Association Protest Against CID Notices : మార్గదర్శికి మద్దతుగా మాట్లాడిన న్యాయవాదులకు సీఐడీ నోటీసులు ఇవ్వటంపై బార్ అసోసియేషన్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీఐడీ అధికారుల తీరు సవ్యంగా లేదని బార్ అసోసియేషన్లు అభిప్రాయం వ్యక్తం చేశాయి. సీఐడీ నోటీసులు జారీ చేసినందుకు నిరసనగా ఈ నెల 17 తేదీన విజయవాడ, మచిలీపట్నం కోర్టులను బాయ్ కాట్ చేస్తున్నట్టు బెజవాడ బార్ అసోసియేషన్, మచిలీపట్నం బార్ అసోసియేషన్లు ప్రకటించాయి. న్యాయవాదులకు సీఐడీ నోటీసులు జారీ చేసినందుకు నిరసనగా విధులను బహిష్కరించాలని నిర్ణయించాయి.
అధికార పార్టీ నాయకుల మంతనాలు : మరోవైపు బార్ అసోసియేషన్ల నుంచి వ్యక్తం అవుతున్న తీవ్ర నిరసనతో పాటు విధుల బహిష్కరణ కార్యక్రమాన్ని విరమింప చేసుకునేందుకు ప్రయత్నించాలని ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. జిల్లా మంత్రి జోగి రమేష్‌తో పాటు మాజీ మంత్రి పేర్ని నానిలకు ఈ బాధ్యత అప్పగించింది. బార్ అసోసియేషన్లు ఈ నిరసన కార్యక్రమాన్ని విరమింపచేసుకునేలా మంతనాలు జరపాల్సిందిగా వారికి సూచనలు జారీ అయ్యాయి.
సీఐడీ నోటీసులపై హైకోర్టులో వ్యాజ్యం : చార్టర్డ్ అకౌంటెంట్లు, చార్టర్డ్ అకౌంటెంట్ శ్రావణ్ అరెస్ట్‌పై ఏపీ ప్రొఫెషనల్స్ ఫోరం ఆధ్వర్యంలో విజయవాడలో ఈ నెల 2న నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడినందుకు సీఐడీ నోటీసు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ చార్టర్డ్ అకౌంటెంట్లు పీవీ మల్లికార్జున రావు, ముప్పాళ్ల సుబ్బారావు శనివారం హైకోర్టులో వ్యాజ్యం వేశారు. తమ వ్యాఖ్యలకు ఆధారాలతో విజయవాడ సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరు కావాలనడం సరికాదన్నారు.
ఆడిటర్ శ్రావణ్ అరెస్ట్ వ్యవహారంపై సమావేశంలో అధికరణ 19(1)(ఏ) ప్రకారం రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను మాత్రమే వినియోగించుకున్నామన్నారు. సీఐడీ నోటీసులు ఇవ్వడం చూస్తుంటే ప్రాథమిక హక్కులను వినియోగించుకున్నందుకు వేధింపులకు గురి చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. శాంతియుత వాతావరణంలో సమావేశాలు నిర్వహించుకునేందుకు అధికరణ 19(1)(బి) వెసులుబాటు కల్పిస్తోందన్నారు. సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు శ్రావణ్‌కు వర్తించవని సమావేశంలో అభిప్రాయం వ్యక్తపరిచామన్నారు.
దర్యాప్తు ముసుగులో ఎంపీ రఘురామకృష్ణ రాజును కస్టోడిల్ టార్చర్‌కు సీఐడీ గురి చేసిందని పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. తమ విషయంలోనూ దర్యాప్తు పేరుతో సీఐడీ పోలీసులు దురుసుగా ప్రవర్తించే అవకాశం ఉందన్నారు. తమ ముందు హాజరుకావాలంటూ ఓ జర్నలిస్ట్‌కు సీఐడీ సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో హైకోర్టు పలు ఆదేశాలిచ్చిందని గుర్తు చేశారు.
న్యాయవాదుల సమక్షంలో విచారణకు హైకోర్టు అనుమతిచ్చిందన్నారు. ఒకవేళ తాము హాజరుకావాల్సి వస్తే గతంలో మాదిరి ఉత్తర్వులివ్వాలన్నారు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించుకున్నందుకు నోటీసుల జారీ సరికాదన్నారు. ఏ రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా తాము మాట్లాడలేదన్నారు. శ్రావణ్ అరెస్ట్ ఘటనపై మాత్రమే మాట్లాడామన్నారు. నోటీసులోని అంశాలను పరిశీలిస్తే దురాభిప్రాయంతో ఇచ్చినట్లుందన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని సీఆర్‌పీసీ సెక్షన్ 160, 91 కింద ఇచ్చిన నోటీసును రాజ్యాంగ, చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విజయవాడ సీఐడీ అదనపు ఎస్పీని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఇవీ చదవండి