Bandi Sanjay Oath at Yadadri: తెలంగాణలోని తెరాస ఎమ్మెల్యేల ఎర కేసులో భాజపాపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రమాణం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రలోభాల కేసులో భాజపాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలను కొనేందుకు భాజపా ప్రయత్నించలేదని స్వామివారిపై ఒట్టేసి చెప్పారు. ఈ అంశంలో తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాల్ విసిరిన బండి సంజయ్... ఆ మేరకు యాదాద్రిలో ప్రమాణం చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు ఒట్టి కట్టుకథ కాకుంటే.. కేసీఆర్ కూడా యాదాద్రికి రావాలని బండి డిమాండ్ చేశారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో ఉన్న బండి సంజయ్... భాజపా నాయకులతో కలిసి యాదాద్రికి బయల్దేరి వచ్చారు. ఇచ్చిన మాట మేరకు తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు ప్రలోభాలతో భాజపాకు ఎలాంటి సంబంధం లేదని స్వామివారిపై ప్రమాణం చేశారు. అనంతరం లక్ష్మీనరసింహ స్వామికి బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అసలేం జరిగిందంటే.. తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరుగుతున్నాయనే తెలుగు రాష్ట్రాల్లో అంశం సంచలనం సృష్టించింది. సైబరాబాద్ పోలీసులు తమకు అందిన సమాచారంతో హైదరాబాద్ శివారు మొయినాబాద్ అజీజ్‌నగర్‌లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో బుధవారం రాత్రి సోదాలు చేశారు. తెరాసకు చెందిన అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్, తాండూరు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, సింహయాజి, నంద కుమార్‌లను అరెస్టు చేశారు.
ఇవీ చదవండి: