Bail to Bandaru Satyanarayana: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టు నాటకీయ కోణంలో జరిగింది. అరెస్ట్ నుంచి ఇప్పటివరకూ నాటకీయ పరిణామాల మధ్య బండారు సత్యనారాయణ మూర్తికి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. రూ.25 వేల పూచీకత్తుతో మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం తెల్లవారు జామున అనకాపల్లి జిల్లా వెన్నెలపాలం నుంచి మాజీ మంత్రిని గుంటూరుకు తీసుకుని వచ్చారు. అప్పటి నుంచి నగరంపాలెం స్టేషన్‌లో విచారణ జరిపిన పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద లాయర్లను అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. వైద్యులు ఆయనకు వైద్యపరీక్షలు చేశారు. బీపీ ఎక్కువ ఉండటంతో బండారును ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలని వైద్యులు సూచించారు. సీఎం జగన్, మంత్రి రోజా మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గుంటూరులో రెండు కేసులు నమోదు చేశారు.
విచారణ గురువారానికి వాయిదా వేసిన హైకోర్టు : బండారు సత్యనారాయణ లాయర్ హైకోర్టును ఆశ్రయించారు. బండారు సత్యనారాయణను అక్రమంగా నిర్బంధించారని పిటిషన్లో పేర్కొన్నారు. రెండు కేసుల్లో 41ఏ నోటీసులు ఇచ్చారని, 41ఏ నోటీసులు ఇచ్చి ఎలా అరెస్టు చేస్తారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది అన్నారు. తాము నోటీసులు ఇవ్వలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలీసుల విధానంపై వివరాలతో కౌంటర్ వేయాలని పిటిషనర్‌కు ఆదేశించారు. విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.
పోలీస్ స్టేషన్ వద్ద ఆంక్షలు: ఉదయం గుంటూరు నగరంపాలెం పీఎస్ వద్ద పోలీసుల ఆంక్షలు విధించారు. బండారు సత్యనారాయణ హైబీపీ, మధుమేహంతో బాధపడుతున్నారు. మందులు ఇచ్చేందుకు ఆయన తనయుడు అప్పలనాయుడు స్టేషన్‌కు వచ్చారు. తండ్రిని కలిసేందుకు అప్పలనాయుడికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
అసలేం జరిగింది: మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బడి మంజుల చేసిన ఫిర్యాదుపై నమోదైన కేసులో బండారును అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిను దూషించారంటూ గుంటూరులోని అరండల్‌పేట ఎస్సై నాగరాజ్ ఇచ్చిన ఫిర్యాదుపై ఆ పోలీస్ స్టేషన్‌లో నమోదైన మరో కేసులో బండారు సత్యనారాయణమూర్తికి 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. ఆయన్ను అరెస్టు చేసే క్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది.
బండారు సత్యనారాయణమూర్తిని అరెస్టు చేయడం కోసం ఆదివారం రాత్రి 10 గంటలకే పోలీసులు వెన్నెపాలెం చేరుకున్నారు. బయటి వారెవరూ ఊళ్లోకి రాకుండా 5 కి.మీ.ల దూరంలోనే బారికేడ్లు పెట్టి నిలువరించారు. ఆయన ఇంటి చుట్టూ వందల మంది పోలీసులను ఉంచి ఆ దరిదాపుల్లోకి ఎవరూ రాకుండా చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు, టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున బండారు ఇంటి వద్దకు చేరుకున్నారు.
సోమవారం ఉదయం స్థానిక డీఎస్పీ బండారు సత్యనారాయణమూర్తి ఇంట్లోకి వెళ్లి కేసు వివరాలు తెలిపి అరెస్ట్ చేయడానికి వచ్చినట్లు తెలిపారు. నోటీసులు చూపించాలని బండారు కోరడంతో పోలీసులు వెనక్కి వచ్చేశారు. మరోసారి బండారును అదుపులోకి తీసుకునే క్రమంలో కొంతమంది పోలీసులు ఆయన ఇంటి గోడలు దూకి లోపలికి ప్రవేశించారు. ఆయన ఇంటి తలుపులను బాదారు. కిటికీల గ్రిల్స్ తీసి లోపలికి వెళ్లేందుకు యత్నించారు. చివరికి బండారు తలుపులు తీయడంతో అయిదుగురు పోలీసు అధికారులు లోపలికి వెళ్లి సుమారు అరగంట పాటు ఆయనతో మాట్లాడారు. అనంతరం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించి అక్కడి నుంచి గుంటూరుకు తరలించారు.