Babu Surety Future Guarantee Program: తొలివిడత మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు కార్యక్రమాల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగట్టేందుకు నేటి నుంచి 45 రోజులపాటు ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకి గ్యారెంటీ’ పేరుతో సరికొత్త కార్యక్రమానికి తెలుగుదేశం శ్రీకారం చుట్టింది. కార్యక్రమంలో భాగంగా నేతలు ఇంటింటికీ వెళ్లి.. పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయనుందో ప్రజలకు వివరిస్తారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పుట్టిందే టీడీపీతో అనే విషయాన్ని గుర్తు చేస్తూ.. ఇప్పుడు జగన్ ఇస్తున్నదానికి మూడు రెట్లు ఎక్కువ సంక్షేమాన్ని ప్రజలకు ఇస్తుందనే విషయాన్ని వివరించనున్నారు. ఈ 45 రోజుల్లో 3 కోట్ల మంది ఓటర్లను కలవడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టారు. 75 శాతం ఓటర్లను ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేసి.. ఎన్నికల్లోగా మొత్తం నూరు శాతం ఓటర్లను వ్యక్తిగతంగా కలవాలన్నది పార్టీ లక్ష్యం.
Babu Surety Bhavishyathuku Guarantee Program: ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకి గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా పార్టీ బూత్‌స్థాయి కార్యకర్తల నుంచి చంద్రబాబు వరకు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తారు. చంద్రబాబు 30 నియోజకవర్గాలకు వెళ్తారు. ఈ నాలుగున్నరేళ్లలో పార్టీ చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా చంద్రబాబు ఇప్పటికే 145 నియోజకవర్గాలకు వెళ్లారని, మిగిలిన 30 నియోజకవర్గాల్లో ఇప్పుడు తిరగనున్నారు. కార్యక్రమంలో భాగంగా యూనిట్, క్లస్టర్ ఇన్‌ఛార్జులు ఒక్కో బూత్‌లో రోజుకి 10 ఇళ్లకు వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జులు కూడా పాల్గొంటారు.
TDP Manifesto: ప్రతి నియోజకవరంలో కనీసం 2 లక్షల మంది ఓటర్లను కలవాలన్నది లక్ష్యం. ఇంటింటికీ వెళ్లి.. టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలను వివరించడంతో పాటు, ఓటర్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఆయా కుటుంబాల్లోని సభ్యులు.. టీడీపీ ప్రకటించిన ఆరు సంక్షేమ కార్యక్రమాల్లో దేనికి అర్హులో, ఆయా పథకాలు అమలైతే ఆ కుటుంబానికి సంవత్సరంలో మొత్తంగా ఎంత లబ్ధి చేకూరుతుందో వివరిస్తారు. ఆ వివరాలు తెలియజేసే ఒక పత్రాన్ని కూడా అందజేస్తారు.
చంద్రబాబు సంతకంతో కూడిన ప్రమాణపత్రం: ‘‘చంద్రబాబు నాయుడు అనే నేను.. మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’లోని వాగ్దానాలను ఎలాంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి పునరంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను’’ అంటూ చంద్రబాబు సంతకంతో కూడిన ప్రమాణపత్రం కూడా ప్రజలకు దానిలో భాగంగానే ఉంటుంది.
కార్యక్రమంలో భాగంగానే ‘ప్రజా వేదిక’ పేరుతో.. ప్రతి ఐదు వేల మంది ప్రజలకు ఒకటి చొప్పున నియోజకవర్గ ఇన్‌ఛార్జులు సమావేశాలు నిర్వహిస్తారు. వివిధ సామాజిక వర్గాల వారీగా సమావేశాలు జరుగుతాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు రేపటి నుంచి జిల్లాల్లో పర్యటించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. సెప్టెంబరు 2న కాకినాడలో పార్టీ జోన్-2 నాయకులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు.
TDP Manifesto: 'భవిష్యత్తుకు గ్యారెంటీ' పేరుతో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో.. వివరాలివే..
చంద్రబాబు షెడ్యూల్: ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని అయిదు లోక్‌సభ స్థానాలకు చెందిన నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ముఖ్య నాయకులు ఆ సమావేశానికి హాజరవుతారు. సెప్టెంబరు 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. రాయదుర్గం, అనంతపురం, బనగానపల్లె, పాణ్యం నియోజకవర్గాల్లో పర్యటన సాగనుంది. 45 రోజులు పాటు 35 నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు.
TDP Manifesto 2024: 'టీడీపీ మేనిఫెస్టోతో వైసీపీ నేతల్లో వణుకుమొదలైంది'