ప్రభుత్వం, పోలీసుల ప్రవర్తన చూస్తే చాలా బాధగా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు వాపోయారు. చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంపై మండిపడ్డారు. చంద్రబాబు బయటకు వెళ్లకుండా పోలీసులు ఇంటి బయట తాళాలు వేశారు. కార్యకర్తలు, తెదేపా నేతలు లోపలికి రాకుండా ఇంటి బయట అడుకుంటున్నారు. ప్రశాంతంగా నిరసనలు తెలపాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
'మన హక్కులు కాపాడుకునేందుకు నిరంతరం పోరాడదాం. ఇంటి గేటుకు తాళ్లు కట్టి బయటికి రాకుండా చేశారు.ఈ పోరాటం ఆగదు.... ఇకముందూ కొనసాగిస్తాం. పోలీసులు అనుమతిస్తే ఆత్మకూరు వెళ్తా... అనుమతించే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటా"- చంద్రబాబు
వంద రోజులకుపైగా 125 కుటుంబాలు ఊరి వదిలిపెట్టి వెళ్లాయని... పొలాన్ని కూడా వదిలిపెట్టిన వారు ఉన్నారని చంద్రబాబు అన్నారు. కేసులు పెట్టేందుకు వెళ్తే నమోదు చేసుకోలేదని ధ్వజమెత్తారు. చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్కడికక్కడ నేతలు బయటకు రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. పోలీసుస్టేషన్లకు తిప్పుతూ భయభ్రాంతులకు గురి చేశారన్నారు. బాధితులందరినీ వారి స్వగ్రామాలకు క్షేమంగా తరలించాలని... దాడులు చేసినవారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండి