Asha Workers Protest: గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్వహించిన.. జగనన్న ఆరోగ్య సురక్ష (Jagananna Aarogya Suraksha) కార్యక్రమంలో విధులు నిర్వహిస్తూ.. మృతి చెందిన ఆశా కార్యకర్త కృపమ్మ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆశా వర్కర్లు.. యూనియన్ నేతలు బైఠాయించారు. వారికి తెలుగుదేశం నేతలు మద్దతు ప్రకటించి.. ధర్నాలో పాల్గొన్నారు. పని ఒత్తిడి కారణంగానే.. కృపమ్మ చనిపోయిందని ఆశా వర్కర్లు ఆరోపించారు. నిరసనను అడ్డుకున్న పోలీసులు.. వారిని బలవంతంగా అరెస్టు చేశారు.
విశాఖలో ఆందోళన: విశాఖ జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద ఆశా వర్కర్లు (Accredited Social Health Activist) నిరసన చేపట్టారు. కృపమ్మ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆశా వర్కర్లపై పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. తమతో గొడ్డు చాకిరి చేయించుకుంటూ.. గుర్తింపు కూడా ఇవ్వడంలేదని మండిపడ్డారు.
కృపమ్మకు సంఘీభావం తెలుపుతూ సత్యసాయి జిల్లాలో నిరసన: జగనన్న సురక్ష కార్యక్రమంలో హఠాన్మరణం చెందిన ఆశా వర్కర్ కృపమ్మకు (Asha Worker Died in Jagananna Arogya Suraksha Program) సంఘీభావం తెలుపుతూ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు రోడ్డుపై బైఠాయించి, కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని ఆశా వర్కర్లు నిరసన తెలిపారు. వీరికి సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని నిరసనకారులను తొలగించేందుకు ప్రయత్నించగా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. కొంత సమయం తర్వాత ఆశా వర్కర్లు నిరసన విరమించుకున్నారు
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ పాదయాత్రలో నా అక్కాచెల్లెమ్మలు అంటూ ఫ్లయింగ్ కిస్సులు.. ఇచ్చి వారి తలమీద చేతులు పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో అదే అక్కాచెల్లెమ్మలు పాతాళంలోకి తొక్కే సమయం ఆసన్నమైందని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 42 వేల మంది ఆశా వర్కర్లకు 10,000 జీతం ఇస్తూ వారి మీద పని ఒత్తిడి పెంచుతూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడేపల్లిగూడెంలో జరిగిన ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో చనిపోయిన ఆశా వర్కర్ కృపమ్మ మృతదేహాన్ని 24 గంటలు గడిచినా వారి కుటుంబ సభ్యులకు అప్పగించలేదని.. అంతే కాకుండా ఆమె తరఫున వచ్చిన వారిని అక్రమ అరెస్టులు చేసి ఏ స్టేషన్లో ఉంచారనేది కూడా ఇప్పటిదాకా తెలియదని విమర్శించారు. చనిపోయిన ఆశా వర్కర్‌కు 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ప్రకటించాలని సీఐటీయూ జిల్లా నాయకుడు డిమాండ్ చేశారు.
"ఆశా వర్కర్ వైద్యులు ముందే కుప్పకూలిపోతే.. అధికారులు ఎవరూ పట్టంచుకోలేదు. వేరే ఆసుపత్రికి తీసుకొని వెళ్లమని అన్నారు. ఈ లోపు ఆమె చనిపోయింది. మాకు ఎటువంటి ఆరోగ్య బీమా కూడా లేదు". - ఆశా వర్కర్
Asha Workers Protest: ఇది ఆరంభమే.. సమస్యలు పరిష్కరించకుంటే తగ్గేదే లే అంటున్న ఆశావర్కర్లు
"పది వేలు ఇస్తూ.. గొడ్డు చాకిరీ చేపిస్తున్నారు. ఆశా వర్కర్‌కు ఆరోగ్య పరంగా ఎటువంటి భద్రత లేదు. జగనన్న ఆరోగ్య సురక్షలో.. ఆశా వర్కర్లకి సురక్ష లేదా అని జగనన్నని ప్రశ్నిస్తున్నాము. విపరీతమైన పని భారం పెడుతున్నారు. సెలవులు కూడా ఇవ్వడం లేదు". - ఆశా వర్కర్
Asha Workers Protest in Rain: సమస్యలపై ఆశావర్కర్ల పోరుబాట.. వర్షంలోనూ ఆగని నిరసన