ఎన్నో ఆశలతో చెమటోడ్చి తయారు చేసిన బొజ్జగణేషుడి విగ్రహాలు కరోనా వల్ల అమ్ముడుపోక తయారీదారులు నానా అవస్థలు పడుతున్నారు. కృష్ణాజిల్లా, మోపిదేవి గ్రామంలో 9 సంవత్సరాలుగా వినాయక చవితి పండగకోసం రాజస్తాన్ పల్లె జిల్లాకు చెందినవారు సంవత్సరం అంతా కష్టపడి గణపతి విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఒక్క మోపిదేవిలో తయారు చేసిన విఘ్నేశ్వరుని విగ్రహాలు వినాయక చవితికి గుంటూరు, కృష్ణాజిలాల్లో ప్రతి పల్లెలో కొలువుదీరతాయి.
సుమారు పది లక్షల రూపాయల పెట్టుబడితో 500 విగ్రహాలు తయారు చేశామని తయారీదారులు తెలిపారు. ఎంతో పెట్టుబడి పెట్టి ఎన్నో అప్పులు చేసి తయారు చేసిన బొమ్మలు వచ్చే సంవత్సరం దాకా ఉంటే రంగులు పోతాయని, లక్షల రూపాయలు స్థలం అద్దె చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనంత గ్రామీణం సిండికేట్ నగరంలో 40 కుటుంబాలు విగ్రహాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నాయి. గుంతకల్లు, తాడిపత్రి, హిందూపురం, పరిగి, ధర్మవరం, రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో ఏటా వచ్చే వినాయక చవితి కోసం లక్షలు ఖర్చు చేసి హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు నుంచి విగ్రహాలకు కావలసిన ముడి సరుకులను తీసుకొస్తారు. విగ్రహాల తయారీలో మరికొంత మందికి ఉపాధి కల్పిస్తారు. ఇలా రూ.4 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు.
కరోనా దెబ్బతో మార్చి నుంచి లాక్ డౌన్ విధించటంతో ఫిబ్రవరిలో ప్రారంభించిన వారు నష్టాలు చూడాల్సి వచ్చింది. ప్రభుత్వం కొన్ని చోట్ల రెండు అడుగుల విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వటంతో పెద్ద విగ్రహాల పరిస్థితి దారుణంగా తయారైంది.
గుంటూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. విగ్రహాలు అమ్ముడుపోక లక్షల్లో అప్పులపాలయ్యామని కళాకారులు కన్నీళ్లు పెడుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో రాజస్థాన్, ఒడిశా, పశ్చిమబంగ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ఆకట్టుకునే ఆకృతులతో వినాయక విగ్రహాలు తయారుచేసి విక్రయిస్తుంటారు. తాజా ఆంక్షల వలన విగ్రహాలు అమ్ముడుపోని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
ఇదీ చూడండి
శ్రీశైలం విద్యుత్ కేంద్రం అగ్ని ప్రమాదంలో మూడు మృతదేహాలు లభ్యం