గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాం గ్రామంలోని ప్రాధమిక ఉన్నత పాఠశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా 14మంది విద్యార్థులను తొలగించారు. దీనికి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని డీఈవో కార్యాలయం ఎదుట ఏపీ టీచర్స్ ఫెడరేషన్ నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన చేపట్టారు.
అసలేం జరిగింది?
లాం గ్రామంలోని ప్రాధమిక ఉన్నత పాఠశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా 14మంది విద్యార్థులను తొలగించారు. అనంతరం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అనుమతి లేకుండా సమీపంలోని తాతిరెడ్డిపాలెంలో 12మంది, ఫణిదం పాఠశాలలో ఇద్దరి పేర్లను చేర్చారు. ఎవరినీ సంప్రదించకుండా చిన్నారులను ఒక బడి నుంచి మరో బడికి తరలించడంపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎంఈవోకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవటం వల్ల డీఈవో కార్యాలయం ఎదుట ఆందోళన మొదలైంది.
డీఈవో కార్యాలయం ఎదుట ఆందోళన
విద్యార్థులను అక్రమంగా వేరే పాఠశాలకు తరలించిన దోషులపై చర్యలు తీసుకోవాలని డీఈవో కార్యాలయం ఎదుట ఏపీ టీచర్స్ ఫెడరేషన్ నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. చిన్నారుల పేర్లు తొలగించినట్లు సాక్ష్యాలు స్పష్టంగా ఉన్నప్పటికీ దోషులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బసవలింగారావు ప్రశ్నించారు. జిల్లాకు సంబంధించిన అధికారి విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దోషులపై చర్యలు తీసుకోవటంలో జాప్యం ఎందుకు జరుగుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో పోస్టులను కాపాడుకునేందుకు, కొత్త పోస్టుల కోసం కొందరు ఉపాధ్యాయులు పక్కదారి పడుతున్నారని విమర్శించారు. వెంటనే తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహిస్తామని ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: మద్యం మత్తులో కుమారుణ్ని చంపిన తండ్రి