Foreign Coal Purchase Tender to Adani: కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రానికి అవసరమైన 7.5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కొనుగోలుకు రాష్ట్ర విద్యుత్ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ గత జనవరిలో టెండరు ప్రకటన జారీచేసింది. దీనికి అదానీ సంస్థతో పాటు చెట్టినాడ్, ఎంబీఎస్, తరుణ్, ఆది సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. మొదట ప్రైస్‌బిడ్లో చెట్టినాడు సంస్థ ఎల్1గా నిలిచింది. కానీ ఆ తర్వాత రివర్స్ టెండరింగ్‌లో అదానీ సంస్థ మరింత తక్కువ ధరకు కోట్‌చేసి టెండర్ దక్కించుకుంది. టన్ను బొగ్గు 13 వేల 100 చొప్పున ఆ సంస్థ కోట్ చేసి ఎల్1గా నిలిచింది. అదానీ సంస్థతో అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. దేశీయ బొగ్గును టన్ను 5 వేలకు జెన్‌కో కొంటోంది. దీని గ్రాస్ కెలోరిఫిక్ వాల్యూ సుమారు 4వేలు.
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు జీసీవీ 6 వేల 500 వరకు ఉంటుంది. చెల్లించే ధరతో పోలిస్తే, పెరిగే జీసీవీ తక్కువే అయినా.. 162శాతం అధిక మొత్తం చెల్లించి అదానీ నుంచి బొగ్గు కొనాలనే ప్రభుత్వం నిర్ణయించింది.సాధారణంగా విదేశీ బొగ్గు టన్ను9 వేలకు మించి కొంటే భారమేనని నిపుణులు చెబుతున్నారు. బొగ్గు కొనుగోలుకు 982.50 కోట్లను ప్రభుత్వం ఖర్చుచేస్తోంది.ఇప్పుడు ఖజానాపై పడే అదనపు భారం సుమారు 300 కోట్లు రూపాయలుగా చెబుతున్నారు.
థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే బొగ్గులో 6శాతం విదేశీబొగ్గు కలపాలని, దేశవ్యాప్తంగా బొగ్గుకు ఉన్న కొరత దృష్ట్యా మరో 9నెలలు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు సర్దుబాటు చేసుకోవాలని.. కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ సూచించింది. ఏపీ జెన్‌కో 10 లక్షల టన్నుల బొగ్గును కొనాలని మొదట భావించింది. విదేశీ బొగ్గు కొనుగోలుకు గతంలో రెండుసార్లు టెండర్లు పిలిస్తే టన్ను బొగ్గుకు దాదాపు 18వేల రూపాయల వరకు బిడ్‌లు దాఖలయ్యాయి. ఈ ధర ఎక్కువని టెండర్లను జెన్‌కో రద్దుచేసింది.
ఇప్పటికే రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులు, సౌరవిద్యుత్ ప్రాజెక్టులు, విశాఖలో డేటాసెంటర్, పోర్టులను దక్కించుకున్న అదానీ సంస్థ.. జెన్‌కోకు బొగ్గు సరఫరా టెండరునూ దక్కించుకుంది. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్వహణ బాధ్యతను అదానీకి అప్పగించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమనే ఆరోపణలు ఉన్నాయి.
రష్యా.. ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న కారణంగా యూరోప్ దేశాలకు రష్యా నుంచి చమురు, సహజవాయువు సరఫరా నిలిచింది. అందువల్ల ఆ దేశాలు విద్యుత్ ఉత్పత్తితో పాటు వివిధ రకాల అవసరాలకు బొగ్గును ఎక్కువగా వినియోగిస్తున్నాయి. దీంతో ఇండోనేసియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, మలేషియా మార్కెట్లలో బొగ్గుకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఈ కారణంగా గతంలో టన్ను బొగ్గు 7వేలకు దొరికితే.. ప్రస్తుతం 10 నుంచి 11వేల రూపాయల వరకూ ఉందని నిపుణులు అంటున్నారు. రవాణా ఖర్చులు, పోర్టు హ్యాండ్లింగ్ ఛార్జీలు కలిపినా అదానీ సంస్థ కోట్ చేసిన ధర కొంచెం ఎక్కువేనని పేర్కొంటున్నారు.
కృష్ణపట్నంలో 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మూడో యూనిట్‌ను వాణిజ్య ఉత్పత్తిలోకి జెన్‌కో తీసుకొస్తోంది. రెండు రోజులుగా ప్లాంటు నుంచి వచ్చే విద్యుత్తును పరిశీలిస్తున్నారు. గురువారం సాయంత్రానికి సీవోడీ చేసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం జెన్‌కో థర్మల్ కేంద్రాల్లో బొగ్గునిల్వలు లేవు. వీటీపీఎస్, ఆర్‌టీపీపీ, కృష్ణపట్నం ప్లాంట్లతో కలిపి మొత్తం 60వేల టన్నులే ఉంది. ఇది ఒక్కరోజుకే సరిపోతుంది. అందుకే నిల్వలు పెంచుకోవాలని విదేశీ బొగ్గు కొనుగోలుకు జెన్‌కో టెండర్లను ఆహ్వానించింది.
ఇవీ చదవండి: