AP State Minister Used CID for Disputes: రాజకీయ పార్టీలపై కక్ష తీర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సీఐడీని ప్రయోగిస్తోందనే విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వమే కాదు మంత్రులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. తామేమీ తక్కువ కాదన్నట్లు సీఐడీని వారి సొంత వ్యవహారాలకు, బెదిరింపులకు ఉపయోగించుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి తాను అగ్రిమెంట్ చేసుకున్న ఓ స్థలం వ్యవహారంలో.. సీఐడీని భూ పంచాయితీకి అస్త్రంలా వాడారు. ‘రెండు సంవత్సరాల క్రితం విక్రయించిన కారు ఇప్పుడు ప్రమాదానికి కారణమైంది.. మీ మీద ఆర్థిక ఆరోపణలొచ్చాయి’ అని టార్గెట్ చేసి సీఐడీ కార్యాలయానికి పిలిపించారు. వారు అనుకున్నట్లుగానే సాయంత్రం వరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించుకుని సెటిల్ చేసేశారు. అంతేకాకుండా కోర్టు కేసులలో రాజీకి వస్తామని.. బయటకు వచ్చినా బాధితులు గొంతెత్తకుండా ఎర వేశారు.
అసలేంటీ ఆ స్థలం కథ : విశాఖలో నివాసముంటున్న ఓ కుటుంబానికి తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్లలో ఎడ్యుకేషనల్ సొసైటీ స్థలం ఉంది. సర్వే నంబరు 504లో 2.51 ఎకరాలుండగా, అందులో 1.69 ఎకరాలు అమ్మాలని వారు నిర్ణయించారు. ఈ స్థలంలోని రెండంతస్తుల భవనంలో ప్రస్తుతం కళాశాల నిర్వహిస్తున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలకు చెందిన ఓ మంత్రి తన కుటుంబసభ్యుల పేరుతో ఈ స్థలాన్ని రూ.3.20 కోట్లతో కొనేందుకు 2016 జులై 26న అగ్రిమెంట్ చేసుకున్నారు. అదే సమయంలో ఎడ్యుకేషనల్ సొసైటీ కరస్పాండెంట్‌గా ఉన్న వ్యక్తి పేరుతో ఆ ఎగ్రిమెంటు రాసిచ్చారు. అడ్వాన్సుగా రూ.70 లక్షలు యజమానులకు ఇచ్చారు. మిగిలిన మొత్తాన్ని 2017 సంవత్సరంలో జనవరి 25లోపు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఒప్పదం తారుమారు కావటంతో వెలుగులోకి: ఈ వ్యవహారంలో కొన్ని పరిణామాలు తలెత్తటంతో బాధితులు ఈ నెల 20వ తేదీన వెలుగులోకి వచ్చారు. తమకు జరిగిన అన్యాయాన్ని మీడియాకు వివరించారు. వారి వివరాల ప్రకారం.. అగ్రిమెంట్ గడువు దాటి ఏళ్లు గడుస్తున్నా స్పందించకపోవడంతో ఏడాది క్రితం సదరు మంత్రిని ఛాంబర్‌లో కలిశారు. ఉత్తరాంధ్రలోని ఓ ఎమ్మెల్యేను వెంట పెట్టుకుని మరీ వెళ్లారు. అతను చెల్లించిన రూ.70 లక్షలు అడ్వాన్సు తిరిగి ఇవ్వండని వారిని మంత్రి ఆదేశించారు. దాంతో ఆ భూమి వేరే వాళ్లకు విక్రయించి.. మంత్రి ఇచ్చిన రూ.70 లక్షలకు బ్యాంకు వడ్డీ కలిపి ఇస్తామని, అమ్మే వరకూ ఆగాలని మంత్రిని కోరారు. లేకపోతే పాత ఒప్పందం ప్రకారమే మిగిలిన డబ్బు చెల్లించి.. మంత్రినే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మంత్రికి వివరించారు. ఆ రెండూ కాదని మంత్రి మరో మాటతో ముందుకు వచ్చారు. అమ్ముతామన్న 1.69 ఎకరాల భూమిలో రూ.70 లక్షలకు అర ఎకరం వెంటనే తన పేరుపై రిజిస్టర్ చేయాలని మంత్రి వారిని కోరారు. అలా చేస్తే విద్యాశాఖ నిబంధనల ప్రకారం తరగతుల నిర్వహణకు అనుమతులు రావని, సొసైటీకి ఇబ్బంది అవుతుందని చెప్పినా వినిపించుకోలేదని బాధితుడు వాపోయాడు.
సెటిల్మెంటుకు వెళ్లిన వ్యక్తికి ఫోన్‌కాల్: ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం సంవత్సరం క్రితం మంత్రి పంచాయితీకి వెళ్లిన వ్యక్తికి విశాఖ నుంచి ఫోన్ వెళ్లింది. మీ మీద ఆర్థిక ఆరోపణ వచ్చిందంటూ.. సీఐ రమ్మంటున్నారని వివరాలు అడిగినా చెప్పకుండా ఫోన్ పెట్టేశారు. అంతేకాకుండా ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రస్తుత కరస్పాండెంట్‌కు ఫోన్ వెళ్లింది. రెండు సంవత్సరాల క్రితం మీ కారు అమ్మేశారు. ఆ కారు ఇప్పుడు ప్రమాదానికి గురైందని.. దానికి కారణమైన యజమాని పోలీసు స్టేషన్‌లో ఉన్నారు, వెంటనే రావాలని కరస్పాండెంట్‌కు ఫోన్‌లో తెలిపారు. గాజువాక పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సదరు వ్యక్తిని మొదట అక్కడే కూర్చోబెట్టారు. ఆ తర్వాత కారులో ఎక్కించుకుని సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. తల్లి, బంధువులను సైతం పిలిపించి లోపల ఉంచారు. 20వ తేదీ సాయంత్రం బయటకు వచ్చినా.. బాధితులు మీడియాకు అందుబాటులోకి రాకుండా ఫోన్లు స్విచాఫ్ చేశారు.
భవిష్యత్‌లో ఇబ్బంది రాకుడాదని రాజీ: ఈ నెల 23న మంత్రి ఒత్తిళ్లపై గోడు చెప్పుకొన్న బాధితుల్లో ఒకరు మళ్లీ ఫోన్‌లో అందుబాటులోకి వచ్చారు. ఆరోజు ఏమైందని ప్రశ్నించగా.. సీఐడీ కార్యాలయంలో ఆరోజే సెటిల్ చేసుకున్నామని సమాధానమిచ్చారు. పాత ఒప్పందానికి కొంచెం అటూ ఇటుగా సెటిల్ చేసుకున్నామని తెలిపారు. స్థల యజమాని కుటుంబంలో అంతా ప్రభుత్వ ఉద్యోగులే ఉన్న కారణంగా.. రోబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో బాధితులు వెనక్కి తగ్గారని తెలుస్తోంది. ఈ సెటిల్‌మెంట్‌లో స్థల యజమానులపై కోర్టులో ఉన్న కేసులను రాజీచేస్తామన్న హామీ సైతం ఇచ్చినట్లు సమాచారం. ఏదేమైనా తన స్థల పంచాయితీని మంత్రి ఏకంగా సీఐడీ కార్యాలయంలో నిర్వహించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.