కాసు, కోడెల... గుంటూరు పరిచయం అక్కర్లేని పేర్లు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, రాష్ట్రస్థాయి పదవులు అలంకరించి తమదైన గుర్తింపు తెచ్చుకున్న కుటుంబాలు. ఈ కుటుంబాల నుంచి ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలిచారు కోడెల శివప్రసాదరావు, కాసు మహేష్ రెడ్డి. ఒకప్పుడు నరసరావు పేట నుంచి గెలిచి చక్రం తిప్పిన ఈ కుటుంబాలు... మారిన పరిస్థితుల్లో వేరే స్థానానికి వెళ్లాల్సి వచ్చింది.
నరసరావుపేట టూ గురజాల
కాసు బ్రహ్మానందరెడ్డి నర్సరావుపేట నుంచి 2సార్లు ఎంపీగా, ఓసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, గవర్నర్ వంటి అత్యున్నత పదవులు అనుభవించారు. మెుదట ఈయన ఫిరంగిపురం నుంచి 1955, 1962లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1967లో నరసరావుపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ క్రమంలోనే 1964 నుంచి 1971 వరకూ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో వరుసగా అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఈయనదే. ఆ తర్వాత 1970, 1980లలో నరసరావుపేట పార్లమెంటు సభ్యుడిగానూ... విజయం సాధించారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత స్థాయి నాయకుడిగా ఉన్న బ్రహ్మానందరెడ్డి మనమడు కాసు మహేశ్ రెడ్డి ఇపుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి వైకాపాలో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. నరసరావుపేట నుంచి కాసు కుటుంబం ఎన్నోసార్లు విజయం సాధించినా ఇపుడు మహేష్ రెడ్డికి అక్కడ పోటి చేసే అవకాశం లేకపోయింది. వైకాపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నందున గురజాలకు వెళ్లాల్సి వచ్చింది.
నమ్మిన బంటు
ఇక నరసరావుపేట నియోజకవర్గం నుంచి చక్రం తిప్పిన మరోనేత కోడెల శివప్రసాదరావు... 1983లో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న అతి కొద్దిమందిలో ఈయన ఒకరు. ఇక్కడి నుంచే 1983, 85, 89, 94, 99లలో వరుసగా 5సార్లు విజయం సాధించారు.ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో విభిన్నమైన శాఖలు నిర్వహించారు. 2004, 2009లో నరసరావుపేట నుంచి ఓడిపోయి రాజకీయంగా ఒడిదుడుకులు వచ్చినా... పార్టీని వీడలేదు. 2014లో మాత్రం తెదేపా - భాజపా పొత్తులో భాగంగా నరసరావుపేట స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. కోడెల సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. నవ్యాంధ్రకు మొదటి శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇపుడు మరోసారి సత్తెనపల్లి నుంచే పోటీలో ఉన్నారు. 2నియోజకవర్గాల్ని అభివృద్ధిలోసమానంగా ముందుకు తీసుకెళ్లానని కోడెల చెబుతున్నారు.