AP Ministers Participated in Industrial Meet at Hyderabad : హైదరాబాద్ ఐటీసీ కాకతీయలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ ఇండస్ట్రీ మీట్‌లో.. పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ అనుకూలమైనదన్న మంత్రి.. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఏ రాష్ట్రానికి లేనంత ఎక్కువ వనరులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని మౌళిక వసతులతోపాటు వివాదరహిత భూమి ఇవ్వడంతో పాటు నీరు, విద్యుత్ ఇస్తున్నట్లు తెలిపారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక విధానం అమలవుతోందని, అనుమతుల కోసం ధరఖాస్తు చేసిన 21 రోజులకు మంజూరయ్యేట్లు విధానాలను తీసుకొచ్చినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో మంత్రి కేటీఆర్ నేతృత్వంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధిని కొనియాడుతూనే...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలల్లో పరిశ్రమలు ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీలో మాదిరి ఎలక్ట్రిక్ బస్సులు ఆంధ్రప్రదేశ్‌లో కూడా తీసుకురానున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు వివాదరహితమైన 48వేల ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు ఆయన వివరించారు.
అత్యధిక పెట్టుబడులు రూ.44వేల కోట్లు వచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, ఇది దేశంలోనే ఎక్కువని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ ఐటీసీ కాకతీయలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ ఇండస్ట్రీ మీట్‌లో.. పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో పాటు ఆయన పాల్గొన్నారు. శివరామకృష్ణ కమిటీ సిఫారసుల ఆధారంగానే మూడు ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.
మూడు రాజధానులపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్రతో కూడిన సమాధానం చెప్పారు. 2014 విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన శివరామ కృష్ణ కమిటీ పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సిఫారసు చేసిందని.. తాము అధికారంలోకి వచ్చిన తరువాత 2019 నుంచి ఆ దిశలో ముందుకు వెళ్లినట్లు వివరించారు. విశాఖపట్నం ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరమని అక్కడ భవంతులు కూడా సిద్దంగా ఉన్నాయని... కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా ఉంచాలని తమ ప్రభుత్వ నిర్ణయమని ఆయన వివరించారు.
ఇవీ చదవండి: