AP JAC protests across the state : ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ జేఏసీ అమరావతి తన మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఉద్యోగుల డిమాండ్లను, సకాలంలో జీతాలు చెల్లించాలంటూ నిరసన కార్యక్రమాలను షురూ చేసింది. రాష్ట్రంలోని 26 జిల్లాలోని ప్రధాన కూడళ్లలో పోస్టర్లను విడుదల చేసింది (ఉద్యోగుల డిమాండ్లకు సంబంధించిన పోస్టర్లు). న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్ట్ ఆఫీస్‌ల ముందు నోటికి నల్ల మాస్క్‌లు పెట్టుకుని ఉద్యోగులు నిరసనలు చేపట్టారు.
విశాఖలో.. ఏపీ అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. న్యాయమైన పరిష్కారం కోరుతూ విశాఖ కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన చేశారు. నోటికి నల్ల మాస్క్‌లు పెట్టుకుని నిరసన చేసిన ఉద్యోగులు.. ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని, సీపీఎస్ రద్దు చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించక పోతే ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు.
తిరుపతి కలెక్టరేట్ వద్ద.. ఉద్యోగులు, పెన్షనర్లకు 1వ తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లించాలంటూ ఏపీ అమరావతి జేఏసీ పిలుపు.. మేరకు ఉద్యోగ సంఘాలు నిరసన చేపట్టాయి. తిరుపతి కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్‍లో జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్‍కు వినతిపత్రం అందజేశారు. 11వ పీఆర్సీ ప్రతిపాదించిన పే స్కేల్స్‌పై సీఎం పునరాలోచించాలని కోరారు. 12వ పే రివిజన్ కమిషన్‌ను వెంటనే నియమించాలని.. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
కర్నూలు కలెక్టర్‍కు వినతిపత్రం.. తమ డిమాండ్ల సాధించే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఉద్యోగులు హెచ్చరించారు. రెండో విడత ఉద్యమంలో భాగంగా.. కర్నూలు కలెక్టర్‍కు వినతిపత్రం అందించారు. నల్ల బ్యాడ్జీలు, నల్ల మాస్కులు ధరించి.. వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల, పెన్షనర్ల, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఏప్రిల్‌లో చేపట్టే కార్యక్రమాలు: మలిదశ ఉద్యమంలో ఏప్రిల్ నెలలో.. 11న సెల్‌డౌన్ కార్యక్రమం, 12న 26 జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమం, 15న విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను పరామర్శించే కార్యక్రమం, 18వ తేదీన సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై ధర్నా చేపట్టే కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
26 జిల్లాల్లో పోస్టర్లు విడుదల.. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నాయకులు నిరసనలు మొదలుపెట్టారు. నల్ల కండువాలను ధరించి, ప్లకార్డులతో జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 1వ తేదీన వేతనాలు, పెన్షన్లు ఇవ్వాలని కోరారు. 11 పీఆర్సీ ప్రతిపాదిత స్కైల్ అమలు చేయాలని కోరారు. పీఆర్సీ అరియర్లు, పెండింగ్ డీఏలు చెల్లించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమయానికి ఉద్యోగులకు జీతాలు రాక నానా అవస్థలు పడుతున్నామని వాపోయారు.
ఇవీ చదవండి: