High Court on Insurance Premium: ప్రీమియం సొమ్ము చెల్లించిన రోజు నుంచే వాహనాలకు ప్రమాద బీమా వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. సొమ్ము చెల్లించిన మరుసటి రోజు బాండ్ జారీ అయినందున ఆ రోజు నుంచే ప్రమాద బీమా వర్తిస్తుందని ఇన్సూరెన్స్ సంస్థ తరఫు న్యాయవాది చేసిన వాదనలను తోసిపుచ్చింది. ప్రీమియం సొమ్మును బీమా సంస్థ అంగీకరించాక పాలసీ తక్షణం అమల్లోకి వస్తుందనే సదుద్దేశంతో చెల్లింపుదారులు ఉంటారని పేర్కొంది. ప్రమాద ఘటనకు ముందే ప్రీమియం అందుకున్నప్పటికీ పాలసీలో పేర్కొన్న తేదీ, సమయం నుంచే బీమా వర్తిస్తుందన్న కారణం చూపుతూ బీమా సంస్థ సొమ్ము చెల్లింపు బాధ్యత నుంచి తప్పించుకోజాలదని స్పష్టం చేసింది.
ఓ కారు ప్రమాదంలో గాయాలపాలైన మహిళకు రూ.30వేల పరిహారం చెల్లించాలంటూ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సవరించి పరిహారాన్ని రూ.లక్షకు పెంచింది. ట్రైబ్యునల్ ఆదేశించిన ప్రకారం పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదంటూ బీమా సంస్థ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టేసింది. మరోవైపు పరిహారం పెంచాలని కోరుతూ బాధితులు అప్పీల్ దాఖలు చేయకపోయినప్పటికీ గాయాల తీవ్రత తదితర అంశాల్ని పరిగణనలోకి తీసుకొని పరిహారాన్ని పెంచే అధికారం హైకోర్టుకు ఉందని తెలిపింది. మోటారు వాహనాల చట్ట నిబంధనలు ప్రమాద బాధితులపై కనికరం చూపేవిగా ఉన్నాయని గుర్తు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు.
ఇదీ జరిగింది: గండవరపు రత్నమ్మ 2000 జూన్ 21న నెల్లూరు బస్టాండ్ వద్ద బస్సు దిగి పూలకొట్టుకు వెళుతుండగా కారు ఢీకొట్టింది. గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు రూ.50వేల పరిహారం ఇప్పించాలని కోరుతూ ఆమె నెల్లూరులోని ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. రూ.30వేల పరిహారం ఇవ్వాలని ట్రైబ్యునల్ 2004 మార్చిలో తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాలు చేస్తూ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నెల్లూరు డివిజనల్ మేనేజరు 2004లో హైకోర్టులో అప్పీల్ వేశారు. ఆ పిటిషన్‌పై ఇటీవల హైకోర్టు విచారణ జరిపింది.
బీమా సంస్థ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కారు ఢీ కొన్న ఘటన 2000 జూన్ 21న ఉదయం 11 గంటలకు చోటు చేసుకుందన్నారు. కారు యజమానికి జారీ చేసిన ఇన్సూరెన్స్ పాలసీ 2000 జూన్ 22 సాయంత్రం 5గంటల నుంచి అమల్లోకి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో బీమా సంస్థ పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. సొమ్ము చెల్లించిన మరుసటి రోజు బాండ్ జారీ అయిందని గుర్తు చేశారు. ఆ వాదనలను తోసిపుచ్చిన న్యాయమూర్తి.. ప్రమాదం చోటు చేసుకున్న రోజే కారు యజమాని ప్రీమియం సొమ్ము చెల్లించారని తెలిపారు. చెల్లించిన గంటల వ్యవధిలో ప్రమాదం చోటు చేసుకుందన్నారు. సదరు మహిళకు కారు యజమాని, బీమా సంస్థ ఇరువురు పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చారు.