AP Govt Hand Over Milk Dairies to Amul: అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సహకార పాల డెయిరీలను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్.. అంతలోనే మడమ తిప్పేశారు. వేలకోట్ల రూపాయలు విలువైన డెయిరీల ఆస్తుల్ని అప్పనంగా అమూల్‌కు కట్టబెట్టేశారు. విజయ బ్రాండ్ దెబ్బతింది. ఒంగోలు డెయిరీని మూయించి అమూల్‌కు అప్పగించారు. వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్న చిత్తూరు డెయిరీతోపాటు, మదనపల్లె ప్లాంటును అమూల్‌కే వైసీపీ సర్కార్ కట్టబెట్టింది. ఇది చాలదన్నట్టు చేయూత ద్వారా లబ్ధిపొందిన మహిళ పాడి రైతులను తప్పనిసరిగా అమూల్‌కే పాలను పోయాలన్న నిబంధనను విధించడం చూస్తుంటే.. ముఖ్యమంత్రి జగన్‌కు అమూల్‌పై అంతులేని ప్రేమ ఉందని..ఇట్టే అర్థమవుతోంది.
వైసీపీ పాలనలో 6 వేల కోట్లతో గ్రామాల్లో మహిళా పాల సహకార సంఘాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి.. వాటినీ అమూల్ సేవకే వినియోగిస్తున్నారు. పార్లర్ల ఏర్పాటుకు పట్టణాలు, కూడలి ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్ని.. కేటాయించడంతోపాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థల ద్వారా అమూల్ ఉత్పత్తులను విక్రయింపజేస్తున్నారు. ఇవన్నీ చాలవన్నట్టు ఆ సంస్థకు పాలు పోసేందుకు చేయూత పథకం కింద బ్యాంకుల ద్వారా మహిళలకు రుణాలిప్పించారు.
అమూల్‌కే అన్నీ.. డెయిరీలు వాటి ఆస్తులు
అంతేకాదు.. అమూల్‌కే పాలు పోస్తామంటూ.. వారి నుంచి ఒప్పంద పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2వేల 955 కోట్ల రూపాయలతో 3.34 లక్షల పాడి పశువుల యూనిట్లను పంపిణీ చేసి.. వైసీపీ ప్రభుత్వం అమూల్‌కు లబ్ధి కల్పిస్తోంది. ఈ స్థాయిలో వేలాది కోట్ల రూపాయలను ధారపోస్తున్నా.. అమూల్ పాల సేకరణ భారీగా పెరిగిందేమీ లేదు. రాష్ట్రంలో సగటున రోజుకు 2.75 లక్షల లీటర్ల పాలు మాత్రమే వస్తున్నాయి. రోజువారీ పాల సేకరణలో ఇది కేవలం 6 శాతం లోపు మాత్రమే ఉంది.
రాష్ట్రంలో 'చేయూత పథకం' ద్వారా మహిళా పాడి రైతులను గుర్తించిన ప్రభుత్వం.. తొలుత ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇతర రాష్ట్రాల నుంచి పశువులను కొనుగోలు చేయాలంటూ 2020 అక్టోబరులో ఉత్తర్వులిచ్చింది. ఒక్కో పశువు ధర 75 వేల రూపాయలుగా పేర్కొంది. ఇందులో బ్యాంకుల నుంచి 56వేల 250 రూపాయలను రుణంగా ఇప్పించింది. మిగిలిన 18వేల 750 రూపాయల మొత్తాన్ని చేయూత కింద బ్యాంకులో జమ చేసింది.
సామాన్యులకు షాక్.. పాల ధరలు పెంపు
తర్వాత నిబంధనలను మార్చి.. పశువులను రాష్ట్రంలోనే కొనుగోలు చేసుకోవచ్చంటూ ఉత్తర్వులను సవరించింది. లబ్ధిదారులు తప్పనిసరిగా అమూల్‌కు పాలను పోయాలన్న నిబంధన పెట్టింది. ఒప్పందాలూ తీసుకుంది. సహకార డెయిరీలకు పాలు పోసే రైతులకు లీటరుకు 4 రూపాయలు చొప్పున బోనస్ ఇస్తామన్న హామీని జగన్ గాలికొదిలేశారు. లీటరుకు 4 రూపాయల బోనస్ ప్రకారం నెలకు సుమారు రూ.26 కోట్ల చొప్పున 53 నెలలకు దాదాపుగా వెయ్యి 378 కోట్ల రూపాయలను ప్రభుత్వం మిగుల్చుకుంది.
బోనస్ ఇస్తే.. రెండు పశువులు ఉన్న కుటుంబానికి 16 వేల రూపాయలు వస్తే వారికి ఆర్థిక భరోసా లభిస్తుందన్న ఆలోచన చేయలేదు. అమూల్‌కు పాలు పోయడం ద్వారా రైతులకు లీటరుకు 20కి పైగా లబ్ధి కలుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. రైతులకు నిజంగా గిట్టుబాటయితే స్వచ్ఛందంగా వచ్చి పాలు పోస్తారనే కనీస విచక్షణ ప్రభుత్వానికి లేకపోయింది. అమూల్‌కు ఇచ్చిన ప్రయోజనాల్ని తమకు కల్పించి ఉంటే.. లీటరుకు ఇప్పుడున్న ధర కంటే 10 రూపాయిలు అదనంగా రైతులకు చెల్లిస్తామని సహకార డెయిరీలు స్పష్టం చేస్తున్నా.. సర్కారు చెవికెక్కించుకోవడం లేదు.
నేరుగా రైతులకు ఇచ్చినా లీటరుకు 10 రూపాయలు చొప్పున ఇవ్వొచ్చనే ఆలోచనా లేదు. అమూల్ సేవలో తరిద్దామనే వైఖరిలోనే వైసీపీ ఫ్రభుత్వం ఆలోచిస్తోంది. 'చేయూత పథకం' కింద పాడి పశువుల పంపిణీ కూడా కలిపితే మొత్తంగా 10 వేల కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని పాలవెల్లువ పేరుతో అమూల్‌కే జగన్ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.