AP Govt Diverted Central Funds: నిధులు లేక.. ప్రభుత్వం విడుదల చేయక.. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు తీసికట్టుగా మారాయి. పదిహేనో ఆర్థికసంఘం సూచించిన మేరకు కేంద్రం నిధులను ఆరోగ్య ఉపకేంద్రాలు, పీహెచ్‌సీ, సీహెచ్‌సీ భవనాల నిర్మాణాలు, అభివృద్ధి పనులు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందులు, ఇతర సదుపాయాల కల్పనకే వినియోగించాలి. కానీ నిధుల్లేక గ్రామాల్లో ఆరోగ్య ఉపకేంద్రాల భవన నిర్మాణాలు పూర్తికాలేదు. అరకొర వసతులతో అద్దె ఇళ్లలో కొనసాగుతున్నాయి.
రాష్ట్ర నిధులతో సంబంధం లేకుండా కేంద్రం ఇచ్చే నిధులనైనా యథాతథంగా విడుదల చేస్తే ఆసుపత్రుల్లో సేవలు మెరుగుపడతాయి. కానీ రాష్ట్రప్రభుత్వం ఆ దిశగా ఇసుమంతైనా ఆలోచించట్లేదు. కేంద్రం రాజ్యాంగబద్ధంగా నిధులు విడుదల చేస్తున్నా.. గత ఆర్థిక సంవత్సరంలో చేసినట్లే.. ఈసారీ నిధులు మళ్లిస్తోంది. 15వ ఆర్థిక సంఘం ద్వారా 2021-22 నుంచి 2025-26 వరకు మొత్తం 2 వేల 601.32 కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం మంజూరుచేసిన 514.14 కోట్లలో ఇప్పటికి 25 కోట్లే విడుదల చేసింది. మిగిలిన నిధుల విడుదలపై ఏ విషయం తేల్చడం లేదు.
కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ నిధులను యథాతథంగా నిర్దేశించిన అవసరాలకు వాడుకోవచ్చు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను 4 వారాల్లోగా ఆరోగ్య శాఖకు పంపాలి.. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధన పాటించట్లేదు. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర నిధులను ఇతర అవసరాలకు దారి మళ్లించింది.
కేంద్రం నుంచి ఒత్తిడి పెరగడంతో 2022 జులైలో 102 కోట్లు, గత మార్చిలో మిగిలిన మొత్తాన్ని వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేసింది. దీనిపై ఆగ్రహించిన కేంద్రం.. 7 శాతం వడ్డీ చొప్పున 40 కోట్లు చెల్లించాలని రాష్ట్రానికి స్పష్టం చేసింది. అలా వడ్డీ కట్టినా.. రాష్ట్ర ప్రభుత్వ ధోరణిలో మార్పు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం నిధులను ఆగస్టులోనే పంపినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికి వైద్యఆరోగ్య శాఖకు పాతిక కోట్లే ఇచ్చి చేయి దులుపుకుంది.
ఏటా కేంద్రం ఇచ్చే నిధులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను జత చేయట్లేదు. ప్రతి ఏడాది కేంద్రం నుంచి జాతీయ ఆరోగ్య మిషన్ కింద 2 వేల 500 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వస్తాయి. ఇందులో 60 శాతం కేంద్ర నిధులకు రాష్ట్రం 40 శాతం విడుదల చేయాలి. తొలుత కేంద్రం నుంచి వచ్చే నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారు. ఆపై వైద్య ఆరోగ్య శాఖకు నామమాత్రంగా విడుదల చేస్తున్నారు. ఈ నిధులు సరిగా విడుదల చేస్తేనే ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందుతాయి. నిధులను వైసీపీ ప్రభుత్వం సరిగ్గా విడుదల చేయకపోవడంతో.. అక్టోబరు వేతనాల కోసం 15 వేల మంది పొరుగుసేవల, ఒప్పంద ఉద్యోగులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
మేం దేనికిచ్చాం..! మీరు దేనికి వాడారు..! నిధుల మళ్లింపుపై రుణసంస్థల నోటీసులు..!