వృత్తి పన్ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించిన గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు సవరణలు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. కొన్ని కేటగిరీలకు వృత్తి పన్ను పెంచింది.
వృత్తి పన్ను 2 శ్లాబులకు గానూ ఒక శ్లాబులో వృత్తి పన్ను పెంచింది ప్రభుత్వం. 1,250 రూపాయలుగా ఉన్న వృత్తి పన్ను శ్లాబు 2 వేల రూపాయలకు పెంచింది. ఏడాదికి 2,500 రూపాయలు మించకుండా వృత్తి పన్ను వసూలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 10 లక్షల రూపాయల లోపు టర్నోవర్ ఉన్న వాణిజ్య సంస్థలకు వృత్తి పన్ను మినహాయింపు ఇచ్చింది.
పన్నులు ఇలా...
- 10- 25 లక్షల రూపాయల లోపు టర్నోవర్ ఉన్న సంస్థలకు రూ.2 వేల రూపాయల వృత్తి పన్ను
- రూ.25 లక్షలు టర్నోవర్ దాటిన సంస్థలకు రూ.2,500 వృత్తి పన్ను
- సినిమా పరిశ్రమలో పనిచేసే వారికి రూ.2,500 మేర వృత్తి పన్ను
- జిల్లా, రాష్ట్ర స్థాయి సహకార సంఘాలకు రూ.2,500 వృత్తి పన్ను
- వీడియో లైబ్రరీ, వే బ్రిడ్జి ఆపరేటర్లకు రూ.2,500 మేర వృత్తి పన్ను
గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం వృత్తి పన్ను వసూళ్లు 32.70 శాతం మేర తగ్గాయని ప్రభుత్వం వెల్లడించింది. వృత్తి పన్ను పెంపు ద్వారా 161 కోట్ల రూపాయల మేర ఖజానాకు అదనపు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా.
ఇదీ చదవండి