AP Passengers in Odisha Train Mishap: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ప్రమాద ఘటనలో ఏపీకి చెందిన బాధితులకు పరిహారం ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైలు ప్రమాదంలో రాష్ట్ర వాసులు చనిపోతే ఆ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు. తీవ్రంగా గాయపడ్డవారికి రూ.5 లక్షలు ఇవ్వాలని జగన్ వెల్లడించారు. స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.లక్ష చొప్పున ఇవ్వాలని సీఎం అధికారలకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాయానికి అదనంగా.. ఈ పరిహారం ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన గురుమూర్తి అనే వ్యక్తి చనిపోయినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యానికి చర్యలు తీసుకుంటున్నట్లు సీఎంకు వెల్లడించారు.
553 మంది సురక్షితంగా ఉన్నారు: ఒడిశాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాధితుల వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఇప్పటి వరకూ ఏపీకి చెందిన 28 మంది ప్రయాణికుల ఫోన్లు కలవటం లేదని బొత్స పేర్కొన్నాడు. ఏపీకి చెందిన మొత్తం 695 మంది ప్రయాణికుల్లో.. 553 మంది సురక్షితంగా ఉన్నట్లు బొత్స తెలిపారు. 92 మంది రైలు ప్రయాణం చేయలేదని సమాచారం ఉందని పేర్కొన్నాడు.
ప్రమాదంలో 22మంది స్వల్ప గాయాలతో బయటపడినట్లు మంత్రి బొత్స వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఐదుగురు విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని బొత్స తెలిపారు. రైలు దుర్ఘటనలో ఇప్పటివరకు రాష్ట్రానికి చెందిన గురుమూర్తి అనే వ్యక్తి చనిపోయినట్లు మంత్రి ప్రకటించాడు. సహాయక చర్యల కోసం ఏపీ నుంచి బాలాసోర్‌కు 50 అంబులెన్సులు పంపించినట్లు బొత్స పేర్కొన్నారు. సహాయక చర్యల్లో భాగంగా మంత్రి అమర్‌నాథ్ బృందం ఇంకా ఒడిశాలోనే ఉందని బొత్స వెల్లడించారు. ఇప్పటికే ఒడిశాకు ముగ్గురు ఐఏఎస్‌లు, ముగ్గురు ఐపీఎస్‌లు వెళ్లారని బొత్స సత్యనారాయణ తెలిపారు.
ఫోటోలు పంపిస్తే వివరాలు సేకరిస్తాం: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ఒకరు మృతి చెందగా.. 14 మంది గాయాలపాలయ్యారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. బాలాసోర్‌లో అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రమాద సమయంలో రెండు రైళ్లలో రాష్ట్రానికి చెందిన 342 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 331 మందిని గుర్తించినట్లు వెల్లడించారు. మిగిలిన వారి ఆచూకీ కోసం అధికారులు నిరంతరం శ్రమిస్తున్నట్లు చెప్పారు. క్షతగాత్రులను భువనేశ్వర్, విశాఖలోని పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. 16 అంబులెన్సులు, 10 మహాప్రస్థానం వాహనాలను భువనేశ్వర్‌లో.. మరో 5 అంబులెన్సులను బాలాసోర్‌లో అందుబాటులో ఉంచినట్లు మంత్రి చెప్పారు.