CM MEET WITH YSRCP REGINAL CO ORDINATORS: వైసీపీలో అసమ్మతి స్వరాలు, విమర్శలు పెరుగుతోన్న దృష్ట్యా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో హడావుడి మొదలైంది. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ ఆరోపించిన అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. బుధవారం తన వద్దనున్న ఆధారాలను బయటపెట్టారు. దీంతో ఇటు రాజకీయంగానూ.. అటు ప్రభుత్వపరంగానూ తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో గతరాత్రి నుంచి నేటివరకూ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతల హడావుడి నెలకొంది.
వైసీపీలో రోజురోజుకు నెలకొంటున్న అసమ్మతి స్వరాలను, విమర్శలను నివారించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి దృష్టి సారించారు. ఈ మేరకు ఈ రోజు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో 26 జిల్లాలకు సంబంధించిన పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మర్రి రాజశేఖర్, ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతల్లో పెరుగుతోన్న అసంతృప్తులపై, విభేధాలపై చర్చించారు. అనంతరం పార్టీలో నేతల మధ్య విభేదాలను పరిష్కరించే విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై రీజినల్ కో ఆర్డినేటర్లకు, ముఖ్య నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. పలు జిల్లాల్లో వైసీపీ పరిస్ధితి, నేతల మధ్య విభేదాలపై ప్రధానంగా చర్చలు జరిపి.. పలు కీలక ఆదేశాలను జారీ చేశారు. వీటితో పాటు పార్టీలో గృహసారథులు పేరిట వాలంటీర్లు, వార్డు సమన్వయకర్తల నియామకాల ప్రక్రియపై చర్చించారు.
మరోపక్క పలు నియోజకవర్గాల్లో వార్డు సమన్వయకర్తల నియామకాల విషయంలో ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తల మధ్య విభేదాలు నెలకొనడం వల్ల నియామకాలు చేయని పరిస్ధితి ఉంది. ఇలాంటి చోట్ల ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై కూడా సీఎం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం.. 26 జిల్లాలకు సంబంధించిన పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లకు వివరించినట్లు సమాచారం.
ఇవీ చదవండి