AP BJP President Daggubati Purandeswari Press Meet: రాష్ట్రంలో కోట్లాది రూపాయల మేర ఇసుక దోపిడీ జరిగిందని పురందేశ్వరి ఆరోపించారు. ప్రజా సమస్యలని ప్రస్తావించడం తమ ప్రధాన అజెండా అని తెలిపిన పురందేశ్వరి.. ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. తాను వివిధ అంశాలను ప్రస్తావిస్తోంటే.. తనపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు.
గతంలో ట్రాక్టర్ లోడ్ ఇసుక 1000 రూపాయలకి లభించేదని.. కానీ ఇప్పుడు 5 నుంచి 6 వేలకు పెరిగిందని స్పష్టం చేశారు. ఇసుక ధరలు పెరగడం వల్ల సామాన్యులపై భారం పడి.. ఇబ్బందులు పడుతున్నారన్న పురందేశ్వరి.. ఇసుక ధర పెరగడంతో నిర్మాణ రంగం కుదేలైందని అన్నారు. దీంతో నిర్మాణ రంగంపై ఆధారపడి జీవించేవాళ్లు దాదాపు 40 లక్షలమంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
పనులు లేక భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని.. సరైన కూలి పని దొరకక.. వేరే పనిచేయక చాలా ఇబ్బంది పడుతున్నారని పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి.. నిర్మాణ రంగంతో ముడిపడి ఉందని పురందేశ్వరి పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక పాలసీని మార్చి.. ఎవరినీ పోటీకి రానీయకుండా దిల్లీలో ఉండే ఒకేఒక్క గుత్తేదారుడికి అప్పగించారని మండిపడ్డారు. కొత్త పాలసీలో భాగంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించారని.. అనుభవం లేని కంపెనీకి ఇసుక మైనింగ్ అప్పగించారని చెప్పారు.
దిల్లీలో ఉండే జయప్రకాశ్ పవర్ వెంచర్ కంపెనీకి (JP Ventures) ఇంతకుముందు మైనింగ్‌లో అనుభవం లేదని తెలిపారు. సబ్ లీజ్ ఇవ్వకూడదనే నిబంధన ఎంవోయూలో ఉందని.. కానీ దాన్ని సైతం ఉల్లంఘించారని పేర్కొన్నారు. శేఖర్ రెడ్డికి సంబంధించిన టర్న్‌కీ ఎంటర్ ప్రైజెస్‌కు జేపీ వెంచర్స్ సంస్థ సబ్ లీజుకు ఇచ్చిందని.. సబ్ లీజ్ తీసుకున్న టర్న్‌కీ సంస్థను పంపేసి.. కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అనధికారికంగా కట్టబెట్టారని ఆరోపించారు. జిల్లాల వారీగా ఇసుక రీచులను అమ్మేశారని విమర్శించారు.
ఇసుక దోపిడీలో భాగంగా తాడేపల్లి ప్యాలెస్‌కు 2 వేల కోట్లు వెళ్లాయని.. హైదరాబాదులోని సుధాకర్ అనే వ్యక్తి ఈ ఇసుక దందాను పర్యవేక్షిస్తున్నారని పురందేశ్వరి అన్నారు. ఇసుక దోపిడీకి ఓ ఐఏఎస్ అధికారి సహకరిస్తున్నట్టు తమకు సమాచారం ఉందన్న పురందేశ్వరి.. జేపీ వెంచర్స్ సంస్థతో ఒప్పందం ముగిసిన తర్వాత కూడా ఇంకా అనధికారికంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని మండిపడ్డారు.
బిల్లుల్లో ఉండే లెక్కలకూ.. జరుపుతోన్న తవ్వకాలకు భారీ వ్యత్యాసం ఉందని.. పెద్దపెద్ద యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరపకూడదనే నిబంధనలున్నాయి.. కానీ దాన్ని ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. నదీ గర్భంలో తవ్వకాలు జరపకూడదని కానీ.. రోడ్లు వేసి మరీ డీప్ డ్రెడ్జింగ్ చేసేస్తున్నారని.. వర్షాకాలంలో తవ్వకూడదనే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పరిధిని మించి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.