కరోనా లాక్డౌన్.. మూగజీవాల పాలిట శాపంగా మారింది. తిండి పెట్టేవారు లేక.. పట్టించుకునేవారు లేక ఆకలితో అలమటిస్తున్నాయి. ప్రభుత్వం తరపున నిరాశ్రయులకు వసతి కల్పించి భోజనం పెడుతున్నారు. అలాగే కరోనా విధులు నిర్వహించే వివిధ శాఖల వారికీ దాతలు ఆహారం అందిస్తున్నారు. కానీ.. వీటి గురించి పట్టించుకునేవారు లేక.. రోడ్లపై తిరిగే ఆవులు, కుక్కలు తిండి కోసం ఆలమటిస్తున్నాయి. చెత్త కుండీల దగ్గర ఆహారం కోసం వాటి వెతుకులాట.. తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. అలాంటి మూగజీవాల ఆకలి తీర్చేందుకు అక్కడక్కడా కొందరు ముందుకు వస్తున్నారు. ఆవులకు,కుక్కలకు పండ్లు, పశుగ్రాసం, బిస్కెట్లు అందిస్తున్నారు.
వాటికోసం కొంత సమయం కేటాయించండి
గుంటూరు నగరంలో గోవుల ఆకలి చూసి కొందరు చలించారు. పశుగ్రాసం కొనుగోలు చేసి వాటి ఆకలి తీర్చారు. లాక్డౌన్ వేళ బయటకు పోయే పరిస్థితులు తక్కువగా ఉన్నా..వాటికోసం సమయం కేటాయించి ఆహారం అందిస్తున్నారు. ఉదయం వేళ కూరగాయలు, నిత్యవసరాల కోసం బయటకు వచ్చే సమయంలో మనకు కనిపించే మూగజీవాలకు ఏదో ఒకటి ఇవ్వటం ద్వారా వాటి ఆకలి తీర్చే అవకాశముంది. మనుషుల ఆకలి తీర్చటంతో పాటు మూగజీవాల గురించి కూడా ఆలోచించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: