Anganwadi Workers Phone Problems In Andhra Pradesh: ఏదైనా నూతన వస్తువు కొనగోలు చేస్తున్నమంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. నాణ్యత, భవిష్యత్తు, నాణ్యత వంటి అంశలాను, అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఒకటికి రెండు చోట్ల ఆరా తీసి కొంటాం. అదే ప్రజాధనంతో కొనేదైతే ప్రభుత్వం ఇంక ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్ల కోసం కొనుగోలు చేసిన స్మార్ట్ ఫోన్లలో ఎమీ ఆలోచించకుండా కొనుగోలు చేసినట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ప్రభుత్వ వెబ్‌సైట్‌లోనూ కనిపించవు. అంత రహస్యం ఎందుకో తెలియదు.
అంగన్వాడీ కార్యకర్తల కోసం ఒక్కో స్మార్ట్ ఫోన్‌ను సాఫ్ట్‌వేర్, నిర్వహణ ఖర్చులతో కలిపి 12వేల 695 రూపాయలకు కొనుగోలు చేశారు. కార్యకర్తలు, సూపర్వైజర్లకు మొత్తం 72 కోట్లతో వీటిని గతేడాది అక్టోబరులో పంపిణీ చేశారు. అయితే ఇప్పుడు వాటిలో సగానికి పైగా ఫోన్లు మూలకు చేరాయి. సరిగా పనిచేయటం లేదని.. సొంత ఫోన్లలో పనిచేస్తున్నామని వారు కార్యకర్తలు, సూపర్వైజర్లు అంటున్నారు.
అనంతపురంలో నెల రోజుల క్రితం ఓ అంగన్వాడీ కార్యకర్త ప్రభుత్వం అందించిన ఫోన్లో లబ్ధిదారుల వివరాలన్నీ నమోదు చేశారు. ఆ తర్వాత ఆ ఫోన్ ఉన్నట్లుండి స్విచాఫ్ అయింది. తర్వాత ఆన్ చేస్తే వివరాలన్నీ గల్లంతయ్యాయి. అప్పటి నుంచి ఆ కార్యకర్త ప్రభుత్వ ఫోన్‌ను వాడడం లేదు. గిరిజన ప్రాంతానికి చెందిన ఓ అంగన్వాడీ కార్యకర్త లబ్ధిదారులకు అందించే రోజువారీ సేవల వివరాలను యాప్‌లో నమోదు చేసేందుకు ప్రయత్నిస్తుంటే కావడం లేదు. ఒక్కోసారి మర్నాడు నమోదు చేయాల్సి వస్తోంది. దీంతో విసిగిపోయి 18వేల రూపాయలు పెట్టి కొత్త ఫోన్ కొనుక్కుని వివరాలు నమోదు చేస్తున్నారు.
అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసేటప్పుడు వాటి సామర్థ్యంపై ఓ అంచనా ఉండాలి. 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమొరీ ఉన్న ఫోన్లు ఇచ్చారు. వైఎస్సారు సంపూర్ణ పోషణ యాప్, పోషణ ట్రాకర్, నెలవారీ నివేదికను అందించేందుకు.. ఎన్పీఆర్ యాప్, పాల వివరాలను పొందుపరిచేందుకు మిల్క్ యాప్ ఇందులో డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు పిల్లల ఎత్తు, బరువు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికల వివరాలు, పాలు, గుడ్లు నిల్వ వివరాలు, అంగన్వాడీ కార్యకర్తల హాజరు, ప్రీస్కూల్ పిల్లల హాజరు నమోదు చేయాలి. గర్భిణులు, ప్రీస్కూల్ పిల్లలు భోజనం చేసే ఫొటోలు, రక్తహీనత ఉన్న గర్భిణులకు మాత్రల పంపిణీ, కేంద్రాల్లో జరిగే కార్యక్రమాలు, గుడ్లు, వైఎస్సార్ కిట్స్, బాలామృతం, పాలు సరఫరా అయినప్పుడు వాటి ఫొటోలు, కార్యకర్తలు ఇళ్లకు వెళ్లే ఫొటోలను యాప్ ద్వారానే అప్లోడ్ చేయాల్సి ఉంది.
"ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు పనిచేయటం లేదు. ప్రతి అంగన్వాడీ కార్యకర్త సొంతంగా ఫోన్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. యాప్లు డౌన్లోడ్ చేయటానికి వారిచ్చిన ఫోన్లు పనిచేయటం లేదు. ఫోన్ సామర్థ్యానికి మించి పని అప్పగిస్తున్నారు." -అంగన్వాడీ కార్యకర్త
ప్రభుత్వం పంపిణీ చేసిన సెల్‌ఫోన్లలో ఈ వివరాలు నమోదు చేయాలంటే గంటల తరబడి జాప్యం అవుతోంది. ఒక్కోసారి ఆ వివరాలను మరుపటి రోజు నమోదు చేయాల్సి వస్తోంది. స్మార్ట్‌ఫోన్లు అందించిన రెండు నెలల నుంచే మొరాయింపు మొదలైంది. విసిగిపోయిన అంగన్వాడీ కార్యకర్తలు ఈ సెల్‌ఫోన్లను పక్కన పెట్టేశారు. ఈ సమస్యను ఎవరి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని వారు వాపోతున్నారు. చేసేది లేక సొంత డబ్బుతో కొత్త ఫోన్లు కొనుక్కుని ఈ వివరాలు నమోదు చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ల కోసం ప్రభుత్వం వెచ్చించిన 72 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరుగా మారింది.
ఫోన్ ఛార్జింగ్ త్వరగా ఖాళీ కావడం, ఉన్నట్లుండి స్విచాఫ్ అయిపోవడం, నమోదు చేసిన వివరాలు మాయమవడం. సిమ్ కార్డులు స్తంభించడం.. తదితర సమస్యలు నిత్యకృత్యంగా మారాయి. ప్రాజెక్టుల పరిధిలో ఇష్నీప్ సమన్వయకర్తలు ఉన్నా ఫోన్ల మరమ్మతుపై వారికి తగిన అవగాహన లేదు. యాప్ల డౌన్లోడ్, నిర్వహణ మాత్రమే చూస్తున్నారు. ఈ ఫోన్లకు గ్యారంటీ కాలం కూడా ఇవ్వలేదు. సీడీపీవోల ద్వారా సిమ్ కార్డులను మాత్రమే మార్చేసి ఇచ్చారు.
ఇలా కొన్ని ప్రాజెక్టుల పరిధిలో కనీసం 30 నుంచి 50 సిమ్ కార్డులను మార్చారంటే పరిస్థితి ఏ రీతిలో ఉందో వెల్లడవుతోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా జరిగే ప్రతి పనినీ కార్యకర్తలు యాప్లలో నమోదు చేయాలి. ఒకవైపు వివరాలు నమోదు చేయాలని అధికారులు నుంచి ఒత్తిడి ఉండగా.. మరోవైపు స్మార్ట్‌ఫోన్ మొరాయింపు వారిని ఇబ్బంది పెడుతోంది. దీంతో అనేక మంది సొంతంగా ఫోన్లు కొనుక్కోవాల్సి రావడం వారికి అదనపు భారంగా మారింది. వారి సమస్యలను మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఫోన్లు మొరాయిస్తున్నట్లు మా దృష్టికి ఎవరూ తీసుకురాలేదని తెలిపారు. దీనిపై పీడీలతో నివేదిక రప్పించుకుని ఎక్కడైనా ఫోన్లు పనిచేయకపోతే మరమ్మతులు చేయిస్తామని చెప్పారు.
"ప్రతిదీ టైమ్ టూ టైమ్ చేయామని చెప్తున్నారు. కానీ, సర్వర్లు చూస్తే సరిగా పనిచేయటం లేదు. మాకు పనికిరాని ఫోన్లు ఇచ్చి.. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు." -అంగన్వాడీ కార్యకర్త