Anganwadi Workers Strike Across the State on Second Day: రాష్ట్రంలో అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మె రెండో రోజూ కొనసాగుతోంది. తమపై వైసీపీ ప్రభుత్వం బెదిరింపులు ఆపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగించాలని అంగన్‌వాడీ సంఘాలు నిర్ణయించాయి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడ్డాయి.
Achchennaidu on Anganwadi Workers Strike: అంగన్వాడీలతో వెట్టిచాకిరీ చేయిస్తున్న జగన్ ప్రభుత్వం డిమాండ్లు పరిష్కరించమంటే కక్షగట్టి వేధిస్తోందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. వారి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకుండా నిర్బంధాలు, అక్రమ అరెస్టులతో రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. తెలంగాణ కంటే జీతాలు ఎక్కువ ఇస్తామని ప్రగల్భాలు పలికిన సీఎం ఇప్పుడెందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. అంగన్వాడీల న్యాయ పోరాటానికి తెలుగుదేశం సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.
సమ్మె విరమించండి, లేదంటే చర్యలు తీసుకుంటాం - అంగన్వాడీలకు ప్రభుత్వం హెచ్చరిక
Anantapur District: అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం సింగనమల మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడి సమస్యలు పరిష్కరించాలని నిరసన చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా సింగనమలలో నిరసన శిబిరం వద్ద ఓ అంగన్వాడీ కార్యకర్త తమ ఆవేదనను వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి తమ సమస్యలు నివేదించేలా ఓ పాట రూపంలో తమ సమస్యను తెలియజేశారు. ఆ పాట కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Bapatla District: బాపట్ల పట్టణంలో అంగనవాడి కార్యకర్తలకు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో ప్రభుత్వం విఫలమైందని ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మజుందర్ అన్నారు. న్యాయమైన కోర్కెలు నెరవేర్చాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన చేపట్టిన సందర్భంగా బాపట్ల పట్టణంలోనూ ఐసీడీఎస్ వద్ద ధర్నా నిర్వహించారు. నెలకు 26 వేల జీతం ఇవ్వాలని పదవి విరమణ ప్రయోజనాలు మంజూరు చేయాలని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో మృతి చెందితే కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని అన్నారు. తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
అక్కాచెల్లెళ్లంటూనే నడిరోడ్డుపై నిలబెట్టారు - అంగన్వాడీల ఆవేదనపై నోరు మెదపని జగనన్న
YSR District: వైఎస్సార్ జిల్లా కమలాపురం ఐసీడీఎస్ కార్యాలయం వద్ద రెండవ రోజు సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అంగన్వాడి కార్యకర్తలు వర్కర్ల ఆందోళనలు చేశారు. అధికారుల వేధింపులు ఆపి అంగన్వాడీలో రాజకీయ జోక్యం ఆపాలని అన్నారు. గౌరవ వేతనం మాకొద్దు కనీసం వేతనం మాకు ఇవ్వాలంటూ ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు, అంగన్వాడీలు నినాదాలు చేశారు. మైదుకూరులో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. డిమాండ్లను పరిష్కరించేదాకా సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు.
Tirupati District: అంగన్ వాడీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలంటూ టీడీపీ, జనసేన నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతిలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద అంగన్వాడీ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకు టీడీపీ, జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. అంగన్ వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరసనలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వారి వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కంటే అదనంగా వేతనాలు చెల్లించాలని కోరారు. అంగన్ వాడీ సహయకులను ప్రధాన కార్యకర్తలుగా గుర్తించాలన్నారు. తక్కువ జీతంతో పనిచేస్తున్న ఆయాలకు ప్రభుత్వ పథకాలు రద్దు చేయడంపై నాయకులు మండిపడ్డారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల ఆందోళన