Anganwadi Workers Agitation in All Over AP: సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు కదం తొక్కారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ.. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు కలెక్టరేట్ల వద్ద దీక్షలకు దిగారు. 36 గంటల పాటు నిర్విరామంగా ఈ దీక్షలను కొనసాగించనున్నట్లు వారు తెలిపారు. సుప్రీంతీర్పు ప్రకారం వారికి గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా సేవలందిస్తున్నా ఉద్యోగ భద్రత లేదని.. పక్క రాష్ట్రాల కంటే వెేతనం అధికంగా చెల్లిస్తామనే హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల కుదింపునకు యత్నిస్తోందని ఆరోపించారు. 2017 నుంచి టీఏ బిల్లులను చెల్లించటం లేదని.. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ఆందోళనలో వందలాది మంది అంగన్వాడీలు పాల్గొన్నారు.
విజయవాడలో.. నగరంలోని ధర్నా చౌక్ వద్దకు అంగన్వాడీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వం వారి సమస్యలను విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలను పరిష్కరించాలంటూ మహాధర్నాకు దిగారు. 36 గంటలపాటు కొనసాగనున్న ఈ మహాధర్నాలో అంగన్వాడీ కార్తకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కడపలో కదం తొక్కిన అంగన్వాడీలు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటనలో ఉండగా.. మరోవైపు అంగన్వాడీ కార్యకర్తలు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన చేపట్టారు. జిల్లాలోని మహాన్ వీర్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్ని శాఖలకు కేటాయించినట్లుగా.. ఐసీడీఎస్‌కు బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించటం లేదని ఆరోపించారు. సంవత్సరాల తరబడి పోరాటం చేస్తున్న ప్రభుత్వం స్పందించటం లేదని ఆవేదన వక్తం చేశారు.
కోనసీమ జిల్లా.. వారికి ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో.. కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు నిరసన చేపట్టారు. అంగన్వాడీ కార్యకర్తలు నల్ల చీరలు ధరించి తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాడి నాలుగు సంవత్సరాలైన.. ఇప్పటి వరకు హామీలను నెరవేర్చలేదని విమర్శించారు.
అల్లూరి జిల్లాలో.. జిల్లాలోని రంపచోడవరంలోని ఐటీడీఏ ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రంపచోడవరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరసనను 36 గంటల వరకు కొనసాగించనున్నట్లు తెలియజేశారు.
గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా.. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు ధర్నా చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలను చిన్నచూపు చూస్తున్నాయని సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ఆరోపించారు. కనీస వేతనం అమలు చేయకుండా అంగన్వాడీల చేత వెట్టిచాకిరి చేయిస్తున్నారన్నారు. అధికారంలోకి వస్తే కనీస వేతనం అమలు చేస్తానన్న సీఎం జగన్ ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేదన్నారు. తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని లేకుంటే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.