రాష్ట్రంలో కులం, మతం పేరుతో విధ్వంస పరిణామాలు జరగడం బాధాకరమని ఆంధ్రా మేధావుల ఫోరం, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. భావితరాలకు అవసరమైన వాటి పై కాకుండా కులమత విద్వేషాల పై చర్చ జరగడం సరికాదని గుంటూరులో మీడియాతో అన్నారు. ఏపీలో జరుగుతున్న డైవర్షన్ రాజకీయాలకు ప్రభావితం కావద్దని ప్రజలకు సూచించారు.
వైకాపా, తెదేపా, జనసేన, కాంగ్రెస్ పార్టీలు ఇలాంటి వివాదాలకు దూరంగా ఉంటాయని.. ఒక పార్టీ మాత్రమే ఇలాంటివి పెంచి పోషిస్తోందని ఆరోపించారు. కేంద్రం ఆంధ్రుల హక్కుల గురించి కాకుండా మత విద్వేషాల గురించి మాట్లాడడం సరికాదన్నారు. వెంకయ్య నాయుడు రాష్ట్రానికి కొంత వరకు మేలు చేశారని.. ఇంకా మేలు చేసేందుకు రాజీనామా చేసి రావాలన్నారు. కులమతాల ఘర్షణలో పడి రాష్ట్రానికి రావాల్సిన నిధులను కోల్పోతామనే విషయాన్ని భావితరాల గుర్తుంచుకోవాలన్నారు.
అమరావతి రాజధానికి సాయం చేస్తున్నామని చెపుతూ.. రాష్టానికి రావలసిన నిధులను ఇవ్వకుండా ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఏపీ పై భాజపాకు అభిమానం ఉంటే విభజన హామీలను తక్షణమే అమలు డిమాండ్ చేశారు. ప్రత్యక హోదా, విభజన చట్టంలోని హక్కులను సాధించే వరకు పోరాటం చేస్తామని.. అందుకు తమతో పాటు కలసి వచ్చే ఇతర రాష్ట్రాల పార్టీలను కలుపుకుని పోరాటం కొనసాగిస్తామన్నారు. వ్యాక్సిన్ వచ్చిన అనంతరం ప్రత్యక్ష పోరాటానికి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: ఆలయాలపై దాడులకు నిరసనగా చినజీయర్ స్వామి రాష్ట్రవ్యాప్త పర్యటన