బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) ఇచ్చిన నివేదిక... పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాలకు అభివృద్ధి విస్తరించేలా ఉందని మంత్రి మోపిదేవి వెంకటరమణ వివరించారు. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొనే సమయం ఇదని ఆయన అభిప్రాయపడ్డారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి అంతా హైదరాబాద్‌కే పరిమితమవ్వడం వల్లే రాష్ట్ర విభజనకు దారి తీసిందని పేర్కొన్నారు. దీనివల్ల ఇతర ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయని చెప్పారు.
ప్రాంతీయ అసమానతలు తొలగించేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానులు ప్రతిపాదించారని మోపిదేవి వివరించారు. కేవలం రాజధాని కోసమే లక్షలాది కోట్లు ఖర్చు చేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అమరావతిని ఎక్కడికి తరలించమని స్పష్టం చేశారు. రాజధాని రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం సదాసిద్ధంగా ఉంటుందని మోపిదేవి భరోసా ఇచ్చారు. అన్ని ప్రాంతాల్లో ప్రాంతీయ అసమానతలు పెచ్చరిల్లే పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రెండు నివేదికలను హైపవర్ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి రిపోర్టు ఇస్తుందని మంత్రి మోపిదేవి తెలిపారు. రెండు నివేదికలు ఒకే విధంగా ఉన్నంత మాత్రాన ఒకరి ప్రభావం పడినట్టు కాదన్నారు. మందడం ఘటనపై స్పందించిన మంత్రి... మహిళలకు ఇబ్బంది కలిగించాలని వైకాపా ప్రభుత్వ ఉద్దేశం కాదన్నారు. కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని... అందుకే పోలీసులు ఇలా వ్యవహరించి ఉండొచ్చని మోపిదేవి వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:'ఎవర్ని మోసం చేయడానికి ఈ కమిటీలు'