Amaravati Framers Protest Completed 1400 Days: అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం నేటితో 1400 రోజులకు చేరుకుంది. మూడు రాజధానులు చేస్తామంటూ జగన్ ప్రభుత్వం చెప్పినప్పుడు ప్రారంభించిన ఉద్యమాన్ని.. ఎన్ని ఆటంకాలు వచ్చినా రైతులు వీడలేదు. రాజధాని మాస్టర్ ప్లాన్‌ని విచ్ఛిన్నం చేయడానికే జగన్ కంకణం కట్టుకున్నారంటూ పోరుబాట సాగిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోలీసుల లాఠీలను లెక్క చేయకుండా అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమంపై ప్రత్యేక కథనం.
2019 డిసెంబర్ 17న వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో.. అమరావతి రైతులు ఉద్యమ బాట పట్టారు. నాటి నుంచి నేటి వరకూ జగన్ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. పోలీసులు దమనకాండకు పాల్పడినా.. మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేసినా.. ప్రభుత్వం వేర్వేరు రూపాల్లో ఒత్తిళ్లు తెచ్చినా.. అన్నదాతలు అంగుళం కూడా వెనక్కి తగ్గలేదు.
దారుణమైన పరిస్థితులు: అమరావతి నుంచి తిరుమలకు ఓసారి, అరసవెల్లికి మరోసారి పాదయాత్ర నిర్వహించి.. తమ ఆవేదనను రాష్ట్ర ప్రజల ముందు తెలియజేశారు. రాజధాని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదనిఅమరావతినే కొనసాగించాలని హైకోర్టు ఆదేశించినా జగన్ పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన రైతన్నలు సుప్రీంలో పిల్ వేయడంతో.. ఇప్పుడు అమరావతి అంశం సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉంది. గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలను జగన్ సర్కార్ ఎక్కడికక్కడ నిలిపివేయడంతో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన భవనాలు వృథాగా పడి ఉన్నాయి.
భూమిలివ్వడమే చేసిన పాపమా: నాలుగేళ్లుగా వైసీపీ సర్కార్ అమరావతి రైతులపై కక్షపూరితంగానే వ్యవహరిస్తుంది. వారికిచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేయలేదు. భూములిచ్చిన రైతులకు కౌలు డబ్బు కూడా సకాలంలో చెల్లించకుండా ఇబ్బంది పెడుతుంది. కౌలు సొమ్ము కోసం రైతులు ప్రతిసారీ హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తోంది. భూములు సీఆర్డీఏకు ఇచ్చి.. వేరే ఆదాయ మార్గాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజాధాని కోసం భూమిలివ్వడమే తాము చేసిన పాపమా అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అమరావతిలో ఇటుక పెట్టని జగన్ విశాఖని అభివృద్ధి చేస్తానని ప్రజలను మభ్యపెడుతున్నారంటూ మండిపడుతున్నారు.
జగన్‌ని శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్ కూర్చోబెడతాం: అమరావతి ప్లాన్‌ని విచ్ఛిన్నం చేయాలనే కుట్రతో ప్రభుత్వం ఆర్ 5 జోన్ ఎత్తుగడ వేసింది. 11 వందల 40 ఎకరాల్లో 50 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలిచ్చేందుకు సిద్ధమైంది. ఇళ్ల పట్టాల పంపిణీకి అనుమతించిన సుప్రీంకోర్టు.. తుది తీర్పునకు లోబడే వ్యవహరించాలని ఆదేశించింది. అయినప్పటికీ ప్రభుత్వం అక్కడ ఇళ్ల నిర్మాణానికి కూడా చర్యలు చేపట్టింది. దీనిపై రైతులు కోర్టుని ఆశ్రయించటంతో అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించింది. దీంతో రైతులకు కాస్త ఊరట లభించింది. పగలు, రాత్రి తేడా లేకుండా ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్‌ని గద్దె దింపితే తప్ప తమకి మంచి రోజులు రావంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ని శాశ్వతంగా తాడేపల్లి ప్యాలెస్ కూర్చోబెడతామని స్పష్టం చేస్తున్నారు.
రైతుల పోరాటం పద్నాలుగువందల రోజులకు చేరిన సందర్భంగా.. ఇవాళ తుళ్లూరు దీక్షా శిబిరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజధానిగా అమరావతి కొనసాగాలని అలాగే చంద్రబాబు నిర్దోషిగా జైలు నుంచి బయటకు రావాలని కోరుతూ.. గాయత్రి, గణపతి, నవగ్రహ, కాలభైరవ, చండీ, రుద్ర హోమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలకు శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.