Amaravati Farmers Petition Hearing in High Court: సీఎం క్యాంప్ కార్యాలయం ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ అమరావతి రైతులు వేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు సింగిల్ జడ్జి విచారించొచ్చని రైతుల తరపు న్యాయవాది ఉన్నం మురళీధరరావు హైకోర్టుకు నివేదించారు. త్రిసభ్య ధర్మాసనం వద్దకు పంపాల్సిన అవసరం లేదన్నారు. ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించిన రోస్టర్ ప్రకారమే బెంచ్ విచారణ జరపాలని కోరారు.
అమరావతి రైతులకు హైకోర్టులో ఊరట, విచారణకు అనుమతించిన హైకోర్టు- కానీ?
ఉత్తరాంధ్ర ముసుగులో కార్యాలయాలను విశాఖకు తరలిస్తున్నారని రాజధాని రైతులు దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. విచారణ మెుదలవగానే న్యాయమూర్తి స్పందిస్తూ, ఫోరం షాపింగ్ వ్యవహారం ఆరోపణపై విచారణకు రావడానికి ముందురోజే ఓ పత్రికలో కథనం వచ్చినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఏజీ వాదనలు రాకముందే ఆ పత్రికలో వార్త ప్రచురించిందన్నారు. ఏజీ స్పందిస్తూ, ఆ కథనంతో తనకు సంబంధం లేదన్నారు. వ్యాజ్యానికి నంబరు కేటాయించకముందే, కోర్టులో విచారణకు రాకముందే కేసు వివరాలు ప్రచురిస్తూ, ప్రసారం చేస్తున్నారన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు స్పందిస్తూ స్కిల్ కేసుకు సంబంధించి సీఐడీ చీఫ్, అదనపు ఏజీ మీడియా సమావేశాలు నిర్వహించారని గుర్తుచేశారు.
కార్యాలయాల ఏర్పాటుకు విశాఖలో అనువైన ప్రదేశాలను గుర్తిస్తూ కమిటీ చేసిన సిఫారసులకు వీలుగా ప్రభుత్వం జీవో 2283 జారీచేసింది. సీఎం కార్యాలయం ఏర్పాటుపై అప్పట్లో వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషనర్లకు మాత్రమే త్రిసభ్య ధర్మాసనం వెసులుబాటు ఇచ్చింది. ఆ వ్యాజ్యాన్ని ప్రస్తుత పిటిషనర్లు దాఖలు చేయలేదు కాబట్టి ప్రస్తుత వ్యాజ్యం త్రిసభ్య ధర్మాసనం వద్దకు పంపాల్సిన అవసరం లేదన్నారు. ఏజీ ఎంతో సమయం వాదనలు వినిపించారు కాని ప్రస్తుత బెంచ్ ఈ వ్యాజ్యాన్ని ఎందుకు విచారించకూడదో చెప్పలేకపోయారన్నారు. పిల్ వేయాలా? రిట్ దాఖలు చేయాలా? అనేది పిటిషనర్ల వ్యక్తిగత ఇష్టంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని కోర్టుకు తెలిపారు.
అమరావతి రైతులు దాఖలు చేసిన వ్యాజ్యం పై అభ్యంతరం లేవనెత్తిన ప్రభుత్వం తరపు ఏజీ వాదనలు వినిపించారు. సంబంధం లేని అంశాలను వ్యాజ్యంలో ప్రస్తావించారన్నారు. వ్యాజ్యం లోతుల్లోకి వెళ్లి విచారణ జరపాలని, కోర్టు అనుమతిస్తే తన వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ఏజీ ఎక్కువ సమయం వాదనలు వినిపించారు కానీ ప్రస్తుతం ఉన్న బెంచ్ ఎందుకు విచారించకూడదో చెప్పలేదని రైతుల తరపు న్యాయవాది అన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇరు వాదనలను పరిగణలోకి తీసుకుని లోతైన విచారణ జరిపేందుకు వ్యాజ్యం సోమవారానికి వాయిదా వేశారు.
విశాఖకు కార్యాలయాల తరలింపు కోర్టు ధిక్కారమే : ప్రభుత్వ నిర్ణయంపై అమరావతి రైతుల ఆగ్రహం