అమరావతి రైతులతో జనసేన అధినేత పవన్ గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. కృష్ణాయపాలెం రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడాన్ని రైతులు పవన్ దృష్టికి తీసుకువచ్చారు. ఎస్సీ రైతులపై అట్రాసిటీ కేసులు పెట్టారని తెలిపారు. గతంలో అమరావతి కౌలుకు సంబంధించి పవన్ ప్రశ్నించడాన్ని రైతులు గుర్తుచేశారు.
ఓ వర్గం రాజధాని అని ప్రభుత్వం ప్రచారం చేస్తోందని అమరావతి దళిత రైతు కన్వీనర్ మార్టిన్ లూథర్ అన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. అమరావతి సమస్యపై మరోసారి గళమెత్తాలని పవన్ను కోరారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
రైతు బాధ గుర్తుతెరిగిన నేత జనసేనాని పవన్ కల్యాణ్ అని ఓ మహిళా రైతు అన్నారు. 330 రోజులుగా అమరావతి రైతులు దీక్షలు చేస్తుంటే...ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టి ప్రవరిస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వైకాపా విస్మరించిందని ఆరోపించారు. రాజధాని మహిళలను.. ఎంతగానో కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని ఆవేదన చెందారు.
అమరావతిలో దోచుకోడానికి ఏంలేదని, విశాఖలో భూకబ్జాలకు పాల్పడేందుకే రాజధాని తరలింపు అని మరో మహిళా రైతు అన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని, దానికి మద్దతు తెలపాలని పవన్ను కోరారు. తెలంగాణ ఉద్యమాన్ని యువకులు ఎలా నడిపించారో... అమరావతి ఉద్యమాన్ని పవన్ నడపాలని కోరారు. అమరావతి ఉద్యమానికి రథసారథిగా ఉండాలని మహిళా రైతులు పవన్ను కోరారు.
ఇదీ చదవండి: