రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ చట్టం తేవాలనుకోవటం భారత రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించటం, రాష్ట్రపతికి, భారత పార్లమెంటుకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను అతిక్రమించడమేనని అమరావతి సంయుక్త కార్యాచరణ కమిటీ ఛైర్మన్ జీవీఆర్ శాస్త్రి పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్ట నిబంధనలకూ అది విరుద్ధమన్నారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులను ఆమోదించవద్దని కోరుతూ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఆయన లేఖ రాశారు. లేఖ ప్రతులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులకు పంపించారు. బిల్లులపై నిర్ణయం తీసుకునేముందు అటార్నీ జనరల్ సలహా తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. ‘‘దానివల్ల రాజ్యాంగపరమైన తప్పిదాలు జరగకుండా నివారించగలరు. బిల్లులకు ఆమోదం పొందేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్ సహాయపడుతున్నారు. హైకోర్టులోనూ ప్రభుత్వం తరఫున వాదిస్తున్నారు. ఆయన సలహా కోరడం సరికాదు’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
విభజన చట్టంలో ‘ఒక రాజధానే’
బిల్లులను మొదటిసారి ప్రవేశపెట్టినప్పుడే.. శాసనమండలి ఛైర్మన్ వాటిని సెలక్టు కమిటీకి పంపించారని తెలిపారు. రెండోసారి వాటిని మండలిలో ప్రవేశపెట్టలేదని గుర్తుచేశారు. వీటిని పట్టించుకోకుండా గవర్నర్ ఆ బిల్లులను ఆమోదిస్తే, అది రాజకీయ సంక్షోభానికి దారి తీస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ‘ఒక రాజధాని’ అనే ఉందని గుర్తుచేశారు. ఆంధప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రస్తుత ముఖ్యమంత్రి సమర్థించారని, రాజధానికి 30 వేల ఎకరాలు ఉండాలని ఆయనే చెప్పారని శాస్త్రి తెలిపారు.
హైకోర్టును మార్చే అధికారం రాష్ట్రపతికే
‘‘ఒక రాష్ట్ర హైకోర్టు మూల కేంద్రం ఎక్కడ ఉండాలన్నది రాష్ట్రపతి నిర్ణయించాలని 1956 నాటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతిలో ఏర్పాటుచేస్తూ 2018 డిసెంబరు 26న రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేశారు. మళ్లీ రాష్ట్రపతి దాన్ని రద్దుచేయడం లేదా, కొత్త నోటిఫికేషన్ జారీచేసి, కొత్తది జారీ చేసినప్పుడే హైకోర్టు మూల కేంద్రాన్ని మార్చడం సాధ్యమవుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కర్నూలుకు తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయం దీనికి విరుద్ధం’’ అని తెలిపారు.
ఇదీ చూడండి