అమరావతినే పరిపాలనా రాజధానిగా కొనసాగించాలని.. మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలంటూ.. రాజధాని గ్రామాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. వరుసగా 243వ రోజు తుళ్లూరు, మందడం, వెలగపూడి, పెదపరిమి, వెంకటపాలెం, అబ్బరాజుపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో రైతులు దీక్షలు నిర్వహించారు. కృష్ణాయపాలెంలో గంగానమ్మ, పోలేరమ్మ, పోతురాజులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాజధాని నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వానికి భూములు ఇచ్చామని.. ప్రభుత్వం మారాక అర్ధాంతరంగా పనులు ఆపేస్తే తమ పరిస్థితి ఏంటని... రైతులు, మహిళలు ప్రశ్నించారు. ప్రభుత్వానికి భూములు ఇవ్వడమే తాము చేసిన పాపమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. మూడు రాజధానుల నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్ మనసు మార్చుకోవాలని కోరారు. కరోనా కారణంగా భౌతిక దూరం పాటిస్తూనే నిరసన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని రైతులు, మహిళలు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి...
ఎంపీలు ఉన్నారుగా.. ప్రత్యేక హోదా ఎందుకు తేలేదు?: సీపీఐ రామకృష్ణ