Amaravati: రాజధాని అమరావతి బృహత్తర ప్రణాళికను సవరించడం.. రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు కలెక్టర్లకు భూ బదలాయించడం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం.. సీఆర్‌డీఏ ఉల్లంఘించిందని రైతుల తరఫున సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ బుధవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేస్తే.. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు హైకోర్టు విధించిన కాలపరిమితిపై మాత్రమే స్టే ఇచ్చిందన్నారు. మిగిలిన తీర్పు అమల్లోనే ఉందన్నారు. రాజధాని అభివృద్ధి పనులకు మినహా.. ఆ భూములను అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదని.. తనఖా పెట్టకూడదని.. మూడో పక్షానికి హక్కులు కల్పించొద్దని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం సుష్పష్టమైన ఆదేశాలిచ్చిందని గుర్తుచేశారు.
మూడో పక్షానికి ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం జీవో ఇవ్వడం హైకోర్టు తీర్పును ఉల్లంఘించినట్లేనన్నారు. మూడో పక్షానికి ఇళ్ల పట్టాలివ్వడం ద్వారా ఆ భూములపై హక్కులు కల్పిస్తే.. బహుళ వివాదాలకు అవకాశం కల్పించడం అవుతుందన్నారు. రాజధాని అమరావతి బృహత్తర ప్రణాళికలో నవనగరాల నిర్మాణానికి రూపకల్పన చేశారని తెలిపారు. ఆ నగరాల అభివృద్ధి.. భూములిచ్చిన రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లతో ముడిపడి ఉందన్నారు. నవనగరాల్లో ఒకటైన ఎలక్ట్రానిక్ సిటి, కాలుష్యఏతర పరిశ్రమ జోన్‌లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను సవరించిందన్నారు. సీఆర్‌డీఏ చట్ట నిబంధనల ప్రకారం.. స్థానిక సంస్థల ఆమోదం లేకుండా మాస్టర్ ప్లాన్‌ను సవరించడానికి వీల్లేదన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా సవరణ చేసిందన్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులను సృష్టించే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం పూనుకుందన్నారు. ఇలాంటి చర్య రాజధాని కోసం భూములిచ్చిన రైతుల హక్కులను హరించడమేనన్నారు. వారికిచ్చిన హామీ నుంచి సీఆర్‌డీఏ వైదొలగడమే అవుతుందన్నారు.
పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణ ఈనెల 21కి వాయిదా పడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధాని అమరావతిలో 1134 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చే నిమిత్తం గుంటూరు(550.65ఎకరాలు), ఎన్టీఆర్(583.93 ఎకరాలు) జిల్లా కలెక్టర్లకు భూ బదలాయింపు నిమిత్తం సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతిస్తూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి ఈ ఏడాది మార్చి 31న జీవో 45 జారీచేశారు. ఆ జీవోను సవాలు చేస్తూ రాజధాని ప్రాంత రైతులు యూ శివయ్య, కె రాజేష్, బెజవాడ రమేశ్‌బాబు, ఆలూరి రాజేష్, కుర్రా బహ్మ, కట్టా రాజేంద్రవరప్రసాద్ హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు.
ఇవీ చదవడండి: