Allotment of Assigned Lands in Andhra Pradesh: రాష్ట్రంలో ఎసైన్డ్ భూముల కేటాయింపు దారి తప్పింది. అనర్హులకే పెద్దపీట వేస్తూ భూ కేటాయింపుల జాబితాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో వైసీపీ నాయకులే చక్రం తిప్పుతున్నారు. లబ్దిదారుల జాబితాలో వైసీపీకి చెందిన నేతల పేర్లే ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నవారు, ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడ్డ కుటుంబాల్లోని సభ్యుల పేర్లను సైతం జాబితాలో చేర్చేశారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, భూమి లేని నిరుపేదలకు.. ఇతర నిబంధనలు వర్తిస్తేనే ఎసైన్డ్ భూముల్ని వారికి కేటాయించాలి. 5 ఎకరాల లోపు ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటున్న వారికి ఎటువంటి అభ్యంతరాలు లేకపోతే పట్టాలు అందించవచ్చు కానీ ఆచరణలో మాత్రం ఈ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు.
విదేశాల్లో ఉంటున్న వారికి, ఉద్యోగ-వ్యాపారాల్లో స్థిరపడ్డ కుటుంబాల వారికి, అధికార వైసీపీ నేతల సన్నిహితులకు.. ఎలాంటి అర్హత లేకపోయిన కూడా ఇష్టానుసారంగా భూములు పంచేస్తున్నారు. ఎసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన వెంటనే.. జిల్లాల్లో వైసీపీ నేతలు భూములను తమ అనుచరుల పరం చేసేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. ఆస్తిపాస్తులున్న వారికి, ప్రవాసులకు, అనర్హులకు కట్టబెట్టేలా నకిలీ ధ్రువపత్రాలతో అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నారు.
అధికార పక్షం వారికే ఎసైన్డ్ భూములు: ఉమ్మడి కడప జిల్లాలో ఈ దందా భారీస్థాయిలో ఉంది. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సొంత ప్రాంతం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట, పలాస నియోజకవర్గాల్లో.. అధికార పక్షం వారికే ఎసైన్డ్ భూములు కేటాయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 54 వేల ఎకరాల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం కాగా.. ఇప్పటి వరకు 47 వేల మందితో జాబితా రూపొందించారు. ఇందులో స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సులతో వచ్చినవారే అధికంగా ఉన్నారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
చక్రం తిప్పుతున్న అధికార పార్టీ నేతలు: ఉమ్మడి కడప జిల్లాలో ఎసైన్డ్ భూముల జాబితాను వైసీపీ నేతల ఇష్టప్రకారమే తయారు చేశారు. కొంతమంది నుంచి ఎకరాకు 50 వేల చొప్పున వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. పేర్లు చేర్చే విషయంలో జమ్మలమడుగు నియోజకవర్గ వైసీపీ నాయకుల మధ్య వివాదాలు కూడా తలెత్తాయి. శ్రీకాకుళం జిల్లాలో అధికారపక్ష ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీల్లో కొందరు వారి భార్య పేర్లను ఎసైన్డ్ భూముల జాబితాలో చేర్చారు. ఇందుకోసం అధికారులపై ఒత్తిడి చేసి సాగులో లేని కొండలను ఇటీవల చదును చేయించారు.
గిరాకి ఉన్న భూములను కాజేసేందుకు యత్నం: ఎచ్చెర్ల మండలం షేర్‌మహ్మద్‌పురంలో సర్వే నెంబరు 112, 696, 895తోపాటు.. మరికొన్ని నెంబర్లలో 750 ఎకరాల విస్తీర్ణంలో కొండ ఉంది. ఇప్పటికే అంబేడ్కర్ వర్సిటీకి 160 ఎకరాలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి 200 ఎకరాలు, రాజీవ్ స్వగృహకు 50 ఎకరాలు, ఏపీ గురుకుల పాఠశాలకు 12 ఎకరాలను ప్రభుత్వం కేటాయించడంతో.. ఇక్కడి భూమికి గిరాకీ ఏర్పడింది. స్థానిక ఎమ్మెల్యే అండతో వైసీపీ నేతలు ఈ భూమి కాజేసేందుకు యత్నిస్తున్నట్టు తెలిసింది.
రెవెన్యూ సిబ్బంది సహకారంతో ఎసైన్మెంట్ కమిటీలో చక్రం తిప్పారు. స్థానిక వైసీపీ ఎంపీటీసీ సభ్యుడి కుటుంబ సభ్యులు, పారామిలటరీలో విశ్రాంత ఉద్యోగి కుటుంబ సభ్యులు, సచివాలయంలో ఉద్యోగం చేస్తూ ఆస్తులు కూడబెట్టుకున్న ఓ ఉద్యోగి.. ఈ భూములు దక్కించుకోనున్నారని తెలుస్తోంది. దీనిపై ఎచ్చెర్ల తహశీల్దార్ టి.సత్యనారాయణను వివరణ కోరగా.. షేర్‌మహ్మద్‌పురంలో కొంతమంది సాగులో ఉన్న భూమికి హక్కులు కల్పించాలని దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. సర్వే నెంబరు 636లో 8మందికి 12 ఎకరాలు కేటాయించేందుకు దస్త్రం పంపించినట్లు తెలిపారు. వారిలో ఇద్దరికి 50 సెంట్లు, ముగ్గురికి 90 సెంట్ల భూమి ఉందని.. మిగిలినవారికి భూములున్నట్లు వెబ్‌లాండ్లో నమోదు కాలేదన్నారు.
Ventures in DKT lands: డీకేటీ భూముల్లో వెంచర్లు.. వైసీపీ నేతల కొత్త వ్యాపారం!
విదేశాల్లో ఉన్నవారికి రాష్ట్రంలో భూములు: వైయస్ఆర్ జిల్లా వీరపునాయునిపల్లె మండలం తంగేడుపల్లెకు చెందిన ఓ మహిళ అమెరికాలో ఉంటున్నారు. ఈమెతో పాటు కుటుంబసభ్యుల పేర్లను ఎసైన్డ్ జాబితాలో చేర్చేశారు. ఇదే గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిని పేరు జాబితాలో ఉంది. కువైట్లో ఉంటున్న యు.రాజుపాళెం వ్యక్తి పేరు, తంగేడుపల్లెలో ఒకే కుటుంబంలోని నలుగురి పేర్లు జాబితాలో ఉన్నాయి. చక్రాయపేట మండలం కల్లూరుపల్లెకు చెందిన ఒకరు.. కీలక నేత పేషీలో ఉద్యోగి. స్వగ్రామంలో భార్య, కుటుంబసభ్యుల పేర్లను జాబితాలో చేర్చారు.
బ్రహ్మంగారిమఠం మండలం గొడ్లవీడులో ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి 15.50 ఎకరాలిచ్చేందుకు వీలుగా జాబితాలో చోటిచ్చారు. రేకలకుంటలో మత్స్యకారుల ఆధార్ కార్డులను సేకరించి, వారి పేరుతో స్థానిక నేతలు పట్టాలు సిద్ధం చేస్తున్నారు. భూములను కేటాయించిన తర్వాత స్థానిక నేతలు తమ అధీనంలో ఉంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
AP TIDCO Houses: టిడ్కో భూముల అమ్మకం.. పేదల్ని కొట్టే ఇళ్లు కట్టాలా..?
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కుమారుడి అనుచరులకు ఎసైన్డ్ భూములిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలో వైసీపీ నేతల కుటుంబసభ్యులకు పట్టాలిచ్చేందుకు ఎసైన్‌మెంట్ కమిటీకి దరఖాస్తులు వచ్చాయి. వీరికోసం బత్తలపల్లి మండలంలో కొత్తగా భూములను చదును చేశారు.
నమోదు చేసిన పేర్లలో అధికార పార్టీలోనే భిన్నాభిప్రాయాలు: కడప జిల్లాలో 5వేల 473, శ్రీసత్యసాయి జిల్లాలో 5వేల 278, నెల్లూరులో 4వేల 385, నంద్యాలలో 3వేల 720, కాకినాడలో 3వేల 827, కర్నూలులో 3వేల 425, చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు 3వేల 110 మందిని ఎంపిక చేశారు. ఈ పేర్లపై అధికార పార్టీలోనే భిన్నాభిప్రాయాలు రావడంతో.. అన్నమయ్య, తిరుపతి, కృష్ణా జిల్లాల్లో ఎసైన్మెంట్ కమిటీలు జాబితాలను ఆమోదించలేదు. ఏలూరు, అనకాపల్లి, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో పాక్షికంగానే కమిటీల ఆమోదం లభించింది.
Hills And Mountains Kabja: కొండలైనా.. గుట్టలైనా కరిగిపోవాల్సిందే.. కబ్జా కోరల్లో కడప జిల్లా