Liquor sales in state: మద్యంపై వచ్చే ఆదాయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వెళ్తామని, మద్యం నిషేధిస్తామని హామీ ఇచ్చి..అధికారంలోకి వచ్చాక మడమ తిప్పేశారు. మద్యం అమ్మకాల ఆదాయాన్ని ఏటేటా భారీగా పెంచుకుంటున్నారు. తనను పాదయాత్రలో కలిసి గోడు వెళ్లబోసుకున్న మహిళలకు ఇచ్చిన భరోసాకు నీళ్లొదిలేశారు. జగన్ భాషలోనే దీన్ని ప్రశ్నించాలంటే..‘ఇది ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం కాకపోతే మరేంటి?.. మద్యం ఆదాయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వెళ్తామని ప్రకటించిన జగన్..అందుకు విరుద్ధంగా మద్యంపై ఆదాయాన్ని ఏటేటా పెంచుతూ వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత.... టీడీపీ ప్రభుత్వ హయాంలోని అయిదేళ్లలో దాదాపు 75వేల 286 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మారు. 2019 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ 94వేల 240 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయించారు.
ఏటా మద్యం విక్రయాల విలువ పెరుగుతూ.. వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరంలో మినహా.. ఏటా మద్యం విక్రయాల విలువ పెరుగుతూనే ఉంది. కొవిడ్ లాక్‌డౌన్ వల్ల కొన్నాళ్లపాటు మద్యం దుకాణాలు మూసేయడంతో అప్పట్లో విక్రయాలు తగ్గాయి. ఆ తర్వాత పెరుగుతూనే ఉన్నాయి. 2020-21తో పోలిస్తే 2021-22లో మద్యం విక్రయాల విలువ దాదాపు 24% పెరిగింది. 4వేల 834 కోట్ల విలువైన మద్యం అదనంగా అమ్మారు. 2021-22తో పోలిస్తే 2022-23లో మద్యం విక్రయాల విలువ 12% పెరిగింది. 3వేల 77 కోట్ల రూపాయల విలువైన మద్యం అదనంగా విక్రయించారు. ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే మద్యం విక్రయాలు జరిగితే వైసీపీ ప్రభుత్వ హయాం పూర్తయ్యేసరికి అయిదేళ్లలో మద్యం విక్రయాల విలువ లక్షా 20వేల కోట్ల రూపాయలు దాటేసే అవకాశం ఉంది.
రుణాలు తీరాలంటే వ్యాపారం పెంచుకోవాల్సిందే.. భవిష్యత్తులో మద్యంపై వచ్చే ఆదాయాన్ని హామీగా చూపించి.. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా వేలకోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. ఏపీఎస్బీసీఎల్ బాండ్లు వేలం వేసి మరీ అప్పులు తెచ్చారు. ఈ రుణాలు తీరాలంటే వ్యాపారం పెంచుకోవాల్సిందే. 2020-21 కంటే 2021-22లో 76 లక్షల కేసుల ఇండియన్ మేడ్ లిక్కర్.. 24 లక్షల 52వేల కేసుల బీర్లు అదనంగా అమ్మారు. 2021-22 కంటే 2022-23లో 71లక్షల 27వేల కేసుల ఇండియన్ మేడ్ లిక్కర్, 34లక్షల 46 వేల కేసుల బీర్లు అదనంగా అమ్మారు. 2020-21లో.. రాష్ట్రంలో రోజుకు సగటున 55కోట్ల 31 లక్షల రూపాయల విలువైన మద్యం అమ్మారు. 2021-22లో దాని విలువ 68కోట్ల 55లక్షల రూపాయలకు పెరిగింది. 2022-23లో రోజుకు సగటున.. 76.98 లక్షల రూపాయల విలువైవన మద్యం అమ్మారు. ఆదాయం పెరిగినా వినియోగం తగ్గించామంటూ సీఎం మొదలుకుని అధికారుల వరకూ పదే పదే చెబుతుంటారు. వినియోగం ఎంత పెరిగిందో గణాంకాలే చెబుతున్నాయి.
ధరలు పెంచినా, తగ్గించినా ప్రభుత్వ ఆదాయం పెరుగుతూ.. ఏదైనా ఒక వస్తువు మీద 10 లేదా 20 శాతం లాభం వేసుకుని అమ్మితే దాన్ని వ్యాపారం అంటారు. కొన్న ధరపై అనేక రెట్లు లాభం వేసుకుని ఎవరైనా వ్యాపారి విక్రయిస్తే.. దురాశ అనుకోవచ్చు. ప్రభుత్వమే అలా చేస్తే.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే.. దాన్ని వివరించేందుకు ‘దోపిడీ’ అనే పదం సరిపోదేమో!.. 100 రూపాయల విలువైన మద్యం అమ్మితే అన్ని ఖర్చులు పోనూ.. ప్రభుత్వానికి 85 రూపాయలు మిగులుతుంది. 2021-22లో 25వేల కోట్ల విలువైన మద్యం విక్రయించారు. దీనిలో ఖర్చులన్నీ పోనూ ప్రభుత్వానికి 21వేల 549 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2022-23లో 28వేల కోట్ల విలువైన మద్యం విక్రయిస్తే.. దీనిలో ఖర్చులన్నీ పోనూ ప్రభుత్వానికి 23వేల 800 కోట్ల వరకూ రాబడి వచ్చిందని అంచనా. మద్యం ధరలు షాక్ కొట్టేలా ఉంటే వినియోగం తగ్గుతుందని తొలుత ధరలు భారీగా పెంచారు. తర్వాత వాటిని తగ్గించారు. ధరలు పెంచినప్పుడు అమ్ముడైన మద్యం పరిమాణం తగ్గినా.. ప్రభుత్వానికి ఆదాయం తగ్గలేదు. ఇప్పుడు ధరలు తగ్గించిన తర్వాత అమ్ముడవుతున్న మద్యం పరిమాణంతో పాటే ఆదాయమూ పెరిగింది. అంటే ధరలు పెంచినా, తగ్గించినా ప్రభుత్వ ఆదాయం పెరుగుతూనే ఉంది.
రాష్ట్ర ఎక్సైజ్ పన్ను.. మద్యంపై విధించే వివిధ పన్నుల్లో రాష్ట్ర ఎక్సైజ్ పన్ను ప్రధానమైనది. దీని ద్వారానే గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి 16వేల 167 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పన్ను ద్వారానే 18వేల కోట్లు వస్తుందని ప్రభుత్వం తాజా బడ్జెట్ అంచనాల్లో తెలిపింది. 18వేల కోట్లు రావాలంటే దాదాపు 33వేల కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మాలి.
మద్యంపై వచ్చే ఆదాయంతో మరింత అప్పులు.. రాబోయే కొన్నేళ్లలో మద్యంపై వచ్చే ఆదాయాన్ని హామీగా చూపించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వేల కోట్లు అప్పు చేసింది. ఏపీఎస్‌బీసీఎల్ బాండ్లు వేలం వేసి 10వేల కోట్ల రుణం తెచ్చింది. ఈ అప్పులు తీర్చాలంటే ఏపీఎస్‌బీసీఎల్ వ్యాపారాన్ని మరింత విస్తరించాలి. అంటే మద్యం అమ్మకాల ద్వారా మరింత ఆదాయం పెంచుకోవాలి. ప్రజలతో మరింత తాగించి, తద్వారా ఆదాయం రాబట్టుకుని అప్పులు తీరుస్తామనేదే ప్రభుత్వ విధానమని స్పష్టమవుతోంది. మద్యం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందేమో కానీ.. దానివల్ల ప్రజలు ఎన్నో రెట్లు నష్టపోతున్నారు. అందుకే రేపటి మన ప్రభుత్వం మద్యాన్ని నిషేధిస్తుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన జగన్.. ఇప్పుడు మద్యంపై ఆదాయమే ముఖ్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాగడానికి డబ్బుల్లేకపోతే కొందరు ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టేసి మరీ కొంటారు. అలాంటి తాగుబోతుల్నే తాకట్టు పెట్టేసి వారిపై అప్పులు తెచ్చిన ఘనత జగన్ సర్కార్‌కే దక్కింది.
ఆదాయాన్ని సంక్షేమ పథకాలకు.. మద్యంపై వచ్చే ఆదాయాన్ని చేయూత, అమ్మ ఒడి, ఆసరా వంటి సంక్షేమ పథకాల అమలుకు వినియోగిస్తామంటూ, ఆ అమలు బాధ్యతను రాష్ట్రప్రభుత్వం కొన్నాళ్ల కింద ఏపీఎస్‌బీసీఎల్‌కు అప్పగించింది. దీనికోసం ఏకంగా చట్ట సవరణే చేసింది. మద్యం విక్రయాల ద్వారా లభించే ఆదాయాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రయోజనాల్ని కాపాడేలా సంబంధిత సంక్షేమ పథకాలకు వినియోగిస్తామని పేర్కొంది. అంటే ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేస్తూ.. అదే సొమ్ముతో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తారట! ఇంతకంటే దారుణమైన చర్య మరొకటి ఉంటుందా?
ఇవీ చదవండి: