అమరావతిలో వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించిన అంశాలపై.. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ అధ్యయనం చేయబోతుంది. ఇందుకు 2 కోట్లను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పరిశోధన సంస్థ ఆమోదం తెలిపింది. గుంటూరు జిల్లాలో ఇటీవల డెంగీ జ్వరాలు పెరగడానికి కారణాలు, జిల్లాలోని పరిస్థితులపై అమరావతి ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్ విభాగంతో కలిసి అధ్యయనం చేయనుంది.
వీటి మీదే అధ్యయనం....
మంగళగిరిలోని చేనేత కార్మికులు మాస్క్లు పెట్టుకోకపోవడం, ఇతర జాగ్రత్తలు తీసుకోకపోవడంవల్ల శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. తరచూ ముక్కు, చెవి, గొంతు సంబంధ వ్యాధుల బారిన పడుతున్న ట్రాఫిక్ పోలీసులు, డ్రైవర్లపై కూడా ఎయిమ్స్ అధ్యయం చేయనుంది. కార్మికులు ఈ తరహా అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఏం చేయాలన్న దానిపైనా పరిశోధన జరపనుంది.
అధ్యయనం ఇలా...
పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి, ఐఐటీ సంస్థల సహకారంతో ఎయిమ్స్ అధికారులు అధ్యయనం చేయనున్నారు. ఆరోగ్య సమస్యలను ప్రాథమిక స్థాయిలో గుర్తించేందుకు వీలుగా మొబైల్ యాప్స్ రూపొందించాలని ఎయిమ్స్ భావిస్తోంది. అధ్యయనంలో భాగంగా... విద్యార్థులు ఆయా ప్రాంతాల్లో నివాసం ఉండే వారి నుంచి వివరాలు సేకరించి , స్థానిక పరిస్థితులపై ఒక అంచనాకు వస్తారు. నిధులు విడుదలైన వెంటనే అధ్యయనం చేపడతామని ఎయిమ్స్ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: