నగరపాలక సంస్థకు ప్రజల పన్నుల ద్వారానే గాక ప్రకటనలు, హోర్డింగ్‌లు వంటి ఇతరత్రా ఆదాయం వస్తుంది. గుంటూరు వంటి నగరాల్లో షాపింగ్‌మాల్స్, బ్రాండెడ్ దుకాణాలు, విద్యాసంస్థలు ఎక్కువగా ఉండటంతో హోర్డింగ్‌లు పెద్ద ఆదాయ వనరు. నగరంలో వివిధ ప్రాంతాలతో పాటు భవనాలపైనా భారీ హోర్డింగ్‌లు ఉన్నాయి. అయితే ప్రకటనల ద్వారా ఆదాయం ఏడాదికి కేవలం మూడున్నర కోట్లు మాత్రమే ఉండటం ఆశ్చర్యం కల్గిస్తోంది. నగరంలో దాదాపు 3వేలకు పైగా హోర్డింగ్‌లు ఉన్నాయి. ఇప్పటికీ దశాబ్దం క్రితం
నిర్ణయించిన ధరలే వసూలు చేస్తున్నారు. ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేసే నగరపాలక సంస్థ హోర్డింగ్ సంస్థల నుంచి డబ్బు రాబట్టడంలో ఉదాసీనత చూపుతోంది. ఖచ్చితంగా డబ్బు వసూలు చేస్తే ఏటా 10 కోట్ల రూపాయల మేర ఆదాయం వస్తుంది.
నగరంలో అనధికారికంగా బోర్డులు ఏర్పాటు చేసే వారు కొందరైతే బిల్లులుచెల్లించకుండా ఎగ్గొట్టే వారు మరికొందరు. ఇలా మూడేళ్లుగా కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన బకాయిలు కోట్లలో పేరుకుపోయాయి. కొత్త పాలకవర్గం వచ్చిన తర్వాత హోర్డింగ్ సంస్థలకు నోటీసులు జారీ చేయడంతో పాటు...అనధికార హోర్డింగ్‌లు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. దిగొచ్చిన సంస్థలు...కరోనా కారణంగా వ్యాపారం సరిగా లేదని బిల్లులు చెల్లించలేమంటూ బీద అరుపులు అరుస్తున్నాయి. బకాయిలు చెల్లించకపోతే హోర్డింగ్‌లు తొలిగిస్తామంటున్నారు మేయర్.
రహదారులు, డివైడర్ల మధ్య విద్యుత్ స్తంభాలకు, ముఖ్య కూడలల్లో హోర్డింగ్‌లు పెట్టుకోవాన్నా, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలన్న టెండర్లు నిర్వహించాలి. కానీ కొందరు ప్రభుత్వ పెద్దల అండతో ప్రకటన బోర్డులు పెట్టుకుంటూ నగరపాలక సంస్థ ఆదాయానికి గండి కొడుతున్నారు.
ఇదీ చదవండి: