మొదటి దశలో గుంటూరు జిల్లాను పట్టిపీడించిన కరోనా.. మళ్లీ పంజా విసురుతోంది. బుధవారం ఒక్కరోజే జిల్లాలో.. 99 మంది వైరస్‌బారిన పడ్డారు. ఇందులో తెనాలిలో అత్యధికంగా 34 కేసులు, గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 21, తాడేపల్లిలో 10 కేసులున్నాయి.
ఇక చేబ్రోలులో 5, మంగళగిరిలో 4, దుగ్గిరాలలో 3, నరసరావుపేట, భట్టిప్రోలు, పొన్నూరు, చుండూరుల్లో రెండేసి చొప్పున పాజిటివ్ కేసులు గుర్తించారు. కేవలం మార్చిలోనే... ఇప్పటిదాకా జిల్లాలో 608 పాజిటివ్ కేసులు నమోదవగా... ప్రస్తుతం 275 క్రియాశీల కేసులున్నాయి.
వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతున్న వేళ.. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రితోపాటు తెనాలి జిల్లా ఆస్పత్రి, మంగళగిరి ఎన్.ఆర్.ఐ, ఎయిమ్స్, తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రిలోనూ కరోనా చికిత్సలకు ఏర్పాట్లు చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియనూ విస్తరించాలని నిర్ణయించారు. ఇప్పటిదాకా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వయసున్న 15వేల 254 మందికి, 60 ఏళ్లు పైబడిన 37వేల 375 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరిని గుర్తించి... వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని కార్యాచరణ రూపొందించారు. టీకాతోపాటు కొవిడ్ నియంత్రణపై 15 రోజులపాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. 27న మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులతో కొవిడ్ నివారణ చర్యలపై కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: మహమ్మారి.. మళ్లీ పంజా!